Begin typing your search above and press return to search.

గీత కామెంట్‌!.. గిరిజ‌నుల‌కు బాబు విల‌న్‌!

By:  Tupaki Desk   |   27 Sep 2017 11:49 AM GMT
గీత కామెంట్‌!.. గిరిజ‌నుల‌కు బాబు విల‌న్‌!
X

ఏ ఎండ‌కాగొడుగు ప‌డ‌తార‌నే పేరున్న విశాఖ జిల్లా అర‌కు ఎంపీ కొత్త ప‌ల్లి గీత తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ఫైరైపోయింది. వాస్త‌వానికి 2014లో వైసీపీ జెండాపై - జ‌గ‌న్ ఫేస్ వాల్యూపై గెలిచి గ‌ట్టెక్కిన ఈ రాజ‌కీయ నాయ‌కురాలు.. ఏరుదాటాక‌.. అన్న‌చందంగా వైసీపీని ప‌క్క‌న పెట్టేసింది. పార్ల‌మెంటు.. త‌దిత‌ర ప్రాంతాల్లో టీడీపీ నేత‌ల‌తో చెట్టాప‌ట్టాలేసుకుని తిర‌గ‌డం, ఉద్య‌మాల‌కు సందేశాల‌కు ఇవ్వ‌డం చేసింది. ఒకానొక ద‌శ‌లో ఆమె టీడీపీ సైకిల్ ఎక్కేస్తోంద‌నే కామెంట్లు కూడా వ‌చ్చాయి. అయితే, ఇప్పుడు ఆమెకు - టీడీపీకి తేడా చేసింది. గిరిజ‌న స‌ల‌హా మండ‌లిలో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో ఫైరైపోయింది.

దీంతో ఒక్క‌సారిగా బాబుపై కామెంట్లు కుమ్మ‌రించింది ఈ రాజ‌కీయ నేత‌. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం గిరిజన ప్రజా ప్రతినిధులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రివిలేజ్‌ కమిటీ ముందు పెడతానని తెలిపారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశానికి హాజరుకాబోనని ఆమె స్పష్టం చేశారు. కాగా, ఏపీ ప్రభుత్వం 20 మందితో ఏర్పాటు చేసిన గిరిజన సలహా మండలిలో కొత్తపల్లి గీతకు స్థానం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇదిలావుంటే.. గీత ఎస్టీ కాదని, అందువల్ల ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ పై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో విచారణ జరుగుతోంది. కొత్తపల్లి గీత ఎస్టీ కాదని.. అయినా కూడా 2014 ఎన్నికల్లో ఎస్టీగా అరకు నుంచి పోటీ చేసి గెలుపొందారని, అందువల్ల ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ గుమ్మడి సంధ్యారాణి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని కొట్టేయాలని కోరుతూ గీత ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆది నుంచి తీవ్ర వివాదానికి కేంద్ర బిందువుగా గీత నిల‌వ‌డం గ‌మ‌నార్హం. ఉమ్మ‌డి ఏపీలో ఆర్డీవోగా ప‌నిచేసిన గీత హైద‌రాబాద్‌ లో అక్ర‌మంగా ఆస్తులు కూడ‌బెట్టార‌ని, జూబ్లీ హిల్స్‌లో ప‌దుల ఎక‌రాల‌ను అక్ర‌మంగా సంపాయించార‌ని వార్త‌లు వ‌చ్చాయి.