Begin typing your search above and press return to search.

పార్టీని బీజేపీలో కలిపేసిన ఏపీ మాజీ మహిళా ఎంపీ

By:  Tupaki Desk   |   18 Jun 2019 12:24 PM GMT
పార్టీని బీజేపీలో కలిపేసిన ఏపీ మాజీ మహిళా ఎంపీ
X
అయిదారేళ్ల రాజకీయ జీవితంలో అన్ని పొలిటికల్ యాంగిల్స్ చూపించేశారా మాజీ ఎంపీ. ఎంపీగా గెలవడం.. పార్టీ మారడం.. మారిన పార్టీలోనూ ఇమడలేక.. పాత పార్టీకి వెళ్లలేక త్రిశంకు స్వర్గంలో ఉండడం.. చివరకు కొత్త పార్టీ పెట్టి రాష్ట్రమంతా పోటీ చేయడం.. ఒక్క చోట కూడా డిపాజిట్టు దక్కించుకోలేకపోవడం.. చివరకు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరడం.. ఇదీ ఆ మాజీ ఎంపీ ఆరేళ్ల రాజకీయ ప్రస్థానం. ఇన్ని మలుపులున్న రాజకీయ జీవితం ఎవరిదా అని ఆశ్చర్యపోవద్దు. ఏపీకి చెందిన ఆ మహిళా నేత ఎవరో కాదు.. కొత్తపల్లి గీత. తాజాగా ఆమె బీజేపీలో చేరారు.

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. తాను స్థాపించిన జనజాగృతి పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఈ సందర్భంగా గీతను పార్టీలోకి అమిత్ షా సాదరంగా ఆహ్వానించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఆహ్వానం మేరకు ఆమె బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారట.

2014లో వైసీపీ తరపున పోటీ చేసిన గీత ఎంపీగా గెలుపొందారు. అనంతరం ఆ పార్టీకి దూరంగా ఉంటూ టీడీపీకి దగ్గరయ్యారు.. అనంతరం టీడీపీ నుంచి కూడా దూరం జరిగారు. చివరికి 2019 ఎన్నికల ముందు సొంతంగా జనజాగృతి అనే పార్టీ స్థాపించారు. రాష్ట్రంలోని చాలా స్థానాలకు ఈ పార్టీ అభ్యర్థులను నిలిపింది. కానీ.. ఒక్క చోట కూడా డిపాజిట్లు రాలేదు.

తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరినట్లుగా తెలుస్తోంది. ఒక్క టెర్మే ఎంపీగా పనిచేసినప్పటికీ గీత బీజేపీలోని చాలామంది సీనియర్ నేతల వద్ద గుర్తింపు తెచ్చుకున్నట్లు దిల్లీ వర్గాల్లో చెబుతుంటారు. ముఖ్యంగా అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్ వంటి నేతలతో ఆమెకు మంచి సఖ్యత ఉంది. అలాగే రాంమాధవ్‌ వద్ద కూడా గీతకు విలువ ఉందని చెబుతుంటారు.

కాగా... చేరిక సందర్భంగా అమిత్ షా, రామ్ మాధవ్ లకు ట్విట్టర్ ద్వారా గీత ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ వేదికగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. అమిత్ షా నాయకత్వంలో పార్టీ ఉన్నతి కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని అన్నారు.