Begin typing your search above and press return to search.

ఈ జంపింగ్ చాలదు..కమలంలోకి మరో జంపింగ్!

By:  Tupaki Desk   |   21 Feb 2018 4:45 AM GMT
ఈ జంపింగ్ చాలదు..కమలంలోకి మరో జంపింగ్!
X
సాధారణంగా నాయకులు మాట్లాడుతున్న తీరును బట్టే వారి రాజకీయ భావజాలంలో ఏమైనా మార్పులు వస్తున్నాయో ఏమో అని మనకు అర్థమవుతూ ఉంటుంది. రాజకీయ భావజాలం వంటి పెద్ద పదాలతో సంబంధం లేని నాయకుల విషయంలో.. వారి మాటలను బట్టి వారు ఒక పార్టీ నుంచి మరో పార్టీ లోకి జంపింగ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు అరకు ఎంపీ కొత్తపల్లి గీతను చూసినా ప్రజలకు, ప్రధానంగా ఆమె తాజా మాటలు వినే భాగ్యానికి నోచుకున్న ఆమె నియోజకవర్గ ప్రజలకు అదే పరిస్థితి ఎదురవుతోంది.

కొత్తపల్లి గీత గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పోటీచేసి అరకు ఎంపీగా గెలిచారు. పార్టీలో ఆమెకు జరిగిన అన్యాయం ఏమిటో తెలియదు గానీ.. నియోజకవర్గ అభివృద్ధి అనే మాట చెప్పుకుని.. తెలుగుదేశం లోకి జంప్ చేసేశారు. మొన్నటికి మొన్న పార్లమెంటు లో తెలుగు ఎంపీలంతా నానా రభసా చేస్తోంటే.. గీత మాత్రం.. తన సీటులోంచి గీత దాటకుండా కూర్చుండిపోయి... అసలు రాష్ట్రానికి నష్టమే జరగలేదన్నట్టుగా వ్యవహరించారు.

తాజాగా ఆమె నియోజకవర్గంలో పర్యటిస్తూ.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలను - అమరావతి నిర్మాణంలో చేతగాని తనాన్ని - కేంద్రం అందిస్తున్న నిధులను దుబారాగా ఖర్చుపెట్టేస్తున్న వైనాన్ని గమనిస్తోంటే.. కరడుగట్టిన భాజపా నాయకులు కూడా చంద్రబాబును అంతగా విమర్శించడంలేదేమో అనిపిస్తోంది. తెలుగుదేశం లోకి ఫిరాయించిన ఆమె మళ్లీ చంద్రబాబునే ఎందుకు తిడుతోందా.. మళ్లీ వైసీపీ వైపే మొగ్గు చూపుతోందా అనుకోడానికి వీల్లేదు. ఎందుకంటే.. వైసీపీ ఆమెను నమ్మే పరిస్థితి లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అందుకే కొత్తపల్లి గీత కొత్తగా కమలదళంలో చేరిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న గీత మాటలు.. డైరక్టుగానే కేంద్రాన్ని - వారు ఇస్తున్న నిధులను కీర్తించే విధంగానూ ఉంటున్నాయి. అసలు రాష్ట్రానికి ఇంతేసి నిధులు ఇవ్వాల్సిన అవసరమే లేదంటూ... ఆమె భాజపా వారికంటె చక్కగా చెబుతున్నారు మరి. భాజపాలోకి చేరడానికే ఒక స్కెచ్ ప్రకారం వెళుతున్నారేమో అని అంతా అనుకుంటున్నారు.