Begin typing your search above and press return to search.

కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు మెడ‌లో వైసీపీ కండువా

By:  Tupaki Desk   |   24 March 2019 11:44 AM GMT
కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు మెడ‌లో వైసీపీ కండువా
X
ఎన్నిక‌ల ముందు తెలుగుదేశం పార్టీకి జ‌గ‌న్ భారీ షాకులు ఇస్తున్నాడు. ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుతో ఉన్న వెస్ట్ గోదావ‌రి ఓట‌రు ఈసారి ఆ పార్టీకి ప‌ట్టం క‌ట్టే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ఒక‌వైపు ప‌వ‌న్ ప్ర‌భావం, మ‌రోవైపు కీల‌క నేత‌లు పార్టీ వీడుతుండ‌టం ఆ పార్టీకి సంక‌ట ప‌రిస్థితులు క‌ల్పించింది. తాజాగా మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. కాపు కార్పొరేషన్ పదవికి కూడా ఆయ‌న రాజీనామా చేశారు. టీడీపీకి ఎంతో న‌మ్మ‌కంగా ఉన్న త‌న‌కు గుర్తింపు లేద‌న్న‌ది ఆయ‌న ఆరోప‌ణ‌.

హైద‌రాబాదులోని లోట‌స్‌ పాండ్‌ లో వైఎస్ జ‌గ‌న్‌ ను సుబ్బారాయుడు క‌లిశారు. వైసీపీ కీల‌క నేత విజ‌య‌సాయిరెడ్డి సుబ్బారాయుడిని తీసుకువ‌చ్చారు. చాలా సేపు ఆయ‌నతో జ‌గ‌న్ క‌లిసి మాట్లాడారు. సుదీర్ఘ చ‌ర్చ‌ల అనంత‌రం వైసీపీలో చేరుతున్న‌ట్టు సుబ్బారాయుడు ప్ర‌క‌టించారు. సుబ్బారాయుడికి జ‌గ‌న్ వైసీపీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌ర స్వాగ‌తం పలికారు.

ఆయ‌న 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంత‌రం తెలుగుదేశంలో చేరినా చంద్ర‌బాబు త‌న‌కు గుర్తింపు ఇవ్వ‌లేద‌ని సుబ్బారాయుడు అన్నారు. న‌ర‌సాపురం వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి ర‌ఘురామ‌కృష్ణంరాజు త‌ర‌ఫున ఈయ‌న ప్ర‌చారం చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. జ‌గ‌న్ ఆయ‌న‌కు పార్ల‌మెంటు నియోజ‌క‌వర్గ ఇన్‌ ఛార్జిగా ఉండ‌మ‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

కొత్తపల్లి సుబ్బారాయడు 1994లో నర్సాపురం నుంచి టీడీపీ తరపున పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చారు. వ‌రుస‌గా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఆ త‌ర్వాత రెండు సార్లు (2009, 2014) ఓడిపోయారు. మూడోసారి ఆయ‌న అస‌లు పోటీ చేయ‌డం లేదు.