Begin typing your search above and press return to search.

బాబుకు ఇది ప‌రువు స‌మ‌స్య‌

By:  Tupaki Desk   |   4 Nov 2016 11:23 AM GMT
బాబుకు ఇది ప‌రువు స‌మ‌స్య‌
X
రెయిన్ గన్ లతో రాయలసీమలో పంటలను కాపాడానంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసుకుంటున్న ప్ర‌చారం బెడిసికొడుతున్న‌ట్లుగా ఉంది. ఈ ప్రచారంపై ఇప్ప‌టివ‌ర‌కు వివిధ పార్టీల నేత‌లు ఘాటుగా స్పందించ‌గా తాజాగా క‌ర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఏపీ సీఎం చంద్ర‌బాబుపై మండిపడ్డారు. రెయిన్ గన్ ల వల్ల రాయలసీమలో ఎక్కడా పంటలు పండలేదని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. అయిన‌ప్ప‌టికీ రైతులను మోసం చేసేలా చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. సీమ‌లో పంటలు పండకపోగా లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందని కోట్ల వాపోయారు. రెయిన్ గన్ లతో పంటలు కాపాడిన‌ట్లు బాబు చెప్తున్న దాంట్లో నిజం ఉంటే...క్షేత్ర‌స్థాయికి వచ్చి వాటిని ప్రత్యక్షంగా పరిశీలించాలని సీఎం చంద్రబాబుకు సూర్యప్రకాశ్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నెల 19న కర్నూలు జిల్లా కొడుమూరులో రైతు సభ ఏర్పాటు చేసినట్లు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చెప్పారు. అందులో సీఎం చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు-అస‌లు నిజాలు వెల్ల‌డించ‌నున్న‌ట్లు కోట్ల వివ‌రించారు.

శాసనమండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య సైతం ఇదే రీతిలో చంద్ర‌బాబు తీరుపై మండిప‌డ్డారు.అనంతపురంలో మూడు రోజులు బస చేసి కరువును పారద్రోలానని చెప్పే చంద్రబాబు అదే జిల్లాల్లో పెద్ద సంఖ్య‌లో కరువు మండలాలు ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు. రెయిన్‌ గన్ల ఏర్పాటులో రూ.158 కోట్ల కమిషన్‌ నొక్కారని విమర్శించారు. రాయలసీమ - ప్రకాశం జిల్లాల్లో వర్షాభావం వల్ల కరువు విలయ తాండవం చేస్తుందని పేర్కొంటూ లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని రామ‌చంద్ర‌య్య‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు నకిలీ విత్తనాల కంపెనీలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. జన చైతన్య యాత్రల పేరుతో ప్రజా ధనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుర్వినియోగం చేస్తున్నాడని సీ రామ‌చంద్ర‌య్య ఆరోపించారు. చైతన్యం రావాల్సింది ప్రజల్లో కాదని, చంద్రబాబు - టీడీపీ నాయకులు - మంత్రులు - ఎమ్మెల్యేల్లోనని విమర్శించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/