Begin typing your search above and press return to search.

జేసీ, కోట్ల కాంగ్రెస్‌తో ట‌చ్‌లో ఉన్నారా?

By:  Tupaki Desk   |   4 April 2021 3:30 AM GMT
జేసీ, కోట్ల కాంగ్రెస్‌తో ట‌చ్‌లో ఉన్నారా?
X
రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్ప‌లేం. ఇప్పుడున్న ప‌రిస్థితి రేపు ఉంటుంద‌ని గ్యారెంటీ ఏమీ లేదు. ప్ర‌జ‌ల అవ‌స రాలు.. అవ‌కాశం.. వారి మూడ్‌ను బ‌ట్టి రాజ‌కీయాలు మారిపోతుంటాయి. పాలిటిక్స్‌లో ఉన్న‌వారికి ఈ విష‌యాలు తెలియ‌వ‌ని చెప్ప‌లేం. ఒక‌ప్పుడు కాంగ్రెస్‌ను రెండు భుజాల‌పై మోసిన ఏపీ ప్ర‌జ‌లు రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో ఆ పార్టీని ఎత్తి కుదేశారు. ఫ‌లితంగా 2014, 2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అడ్ర‌స్ లేకుండా పోయింది. అయితే.. ఇదే ప‌రిస్థితి ఇంకా కొన‌సాగుతుందా? ఎప్ప‌టికీ కాంగ్రెస్ పుంజుకునే ప‌రిస్థితి లేదా? అంటే.. ఉంద‌నే అంటున్నారు అదే పార్టీకి చెందిన మాజీ సీనియ‌ర్లు. ప్ర‌స్తుతం ఏపీ చాలా క్లిష్ట‌మైన ప‌రిస్థితిలో ఉంది. విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్క‌టీ నెర‌వేర‌లేదు.

ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా కోసం ఏపీ ప్ర‌జ‌లు క‌ల‌లు గంటున్నారు. అయితే.. దీనిని ఇచ్చేందుకు కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం స‌సేమిరా అంటోంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ మాత్రం తాను ఇక్క‌డ గెల‌వ‌క‌పోయినా.. కేంద్రంలో ప‌గ్గాలు చేప‌ట్ట‌క‌పోయినా.. తాము క‌నుక అధికారంలోకి వ‌స్తే.. హోదా ఇస్తామ‌ని చెబుతోంది. అదేవిధంగా విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్నఅంశాల‌ను సైతం అమ‌లు చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ప‌దేప‌దే రాష్ట్ర నేత‌లు, గ‌తంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో రాహుల్ గాంధీ సైతం హామీ ఇచ్చారు. సో.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో .. కాంగ్రెస్ వైపు ప్ర‌జ‌లు మొగ్గు చూపించే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీనిని కొంద‌రు సీనియ‌ర్లు ప‌సిగ‌డుతున్నారు.

రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి.. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల స‌మ‌యానికి 10 ఏళ్లు పూర్త‌వుతాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న పార్టీల వ‌ల్ల త‌మ‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం ల‌భించ‌లేద‌ని క‌నుక ప్ర‌జ‌లు అనుకుంటే.. తిరిగి కాంగ్రెస్‌కు పున‌ర్వైభ‌వం ఖాయ‌మ‌ని క‌ర్నూలు కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి కోట్ల కుటుంబానికి చెందిన కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డి, అనంత‌పురానికి చెందిన మాజీ ఎంపీ.. జేసీ దివాక‌ర్ రెడ్డి వంటివారు లెక్క‌లు వేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ కూడా టీడీపీలోనే ఉన్నారు. అయితే.. ఈ పార్టీలో వీరేమీ సంతృప్తిగా లేరు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో కాంగ్రెస్‌లో ఉన్న వీరు.. ద‌శాబ్దాల పాటు ఆ పార్టీలో చ‌క్రంత తిప్పారు. ముఖ్యంగా కోట్ల విజ‌య‌భాస్క‌‌ర‌రెడ్డి అయితే.. ముఖ్య‌మంత్రి కూడా అయ్యారు.

ఆయ‌న వార‌సుడిగా అరంగేట్రం చేసిన సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి సుజాత‌మ్మ‌లు సైతంఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా చ‌క్రం తిప్పారు. అయితే, విభ‌జ‌న త‌ర్వాత వారు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకివ‌చ్చారు. అయితే.. వాస్త‌వానికి టీడీపీలో ఉన్న కేఈ కృష్ణ‌మూర్తి కుటుంబంతో కోట్ల కుటుంబానికి రాజ‌కీయ వైరం ఉంది. అయితే... చంద్ర‌బాబు ఇద్ద‌రి మ‌ధ్య స‌యోద్య కుదిర్చి గ‌త ఎన్నిక‌ల్లో టికెట్లు ఇచ్చారు. అయితే.. అప్ప‌టికి స‌ర్దు కుపోయినా.. ఎన్నిక‌ల్లో మాత్రం ప‌ర‌స్ప‌రం ఓడించుకున్నార‌నే టాక్ క‌ర్నూలులో ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉంది. ఈ క్ర‌మంలో ఇక‌, టీడీపీలో ఉండి ప్ర‌యోజ‌నం లేద‌ని భావిస్తున్నారు. అదేవిధంగా జేసీ కుటుంబం కూడా టీడీపీలో ఉండి తాము పాముకునేది ఏమీ లేద‌ని బాహాటంగానే అంటున్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో తాడిప‌త్రిలో జేసీ ప్ర‌భాక‌ర్ వ‌ర్గం గెలిచింది. అయితే.. ఇది టీడీపీ క్రెడిట్ కాద‌ని.. సీఎం జ‌గ‌న్ స‌హ‌కారంతోనే తాము గెలిచామ‌ని ప్ర‌భాక‌ర్ బ‌హిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామాల అనంత‌రం.. కేంద్రంలోను, రాష్ట్రంలో నూ జ‌రుగుతున్న రాజ‌కీయాల‌పై ఈ ఇద్ద‌రు నాయ‌కులు కూడా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. టీడీపీ, వైసీపీల‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పోయింద‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అంటే.. హోదా విష‌యంలోకానీ.. పోలవ‌రం విష‌యంలోకానీ..ఈ రెండు పార్టీల‌కు కేంద్రం వ‌ద్ద చుక్కెదురు అవుతోంది. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు కాంగ్రెస్ వైపు మ‌ళ్లే అవ‌కాశం ఉంద‌ని ఈ నేత‌లు భావిస్తున్నారు. పైగా వైసీపీ, టీడీపీలు కుటుంబ పార్టీల‌ని కూడా ప్ర‌జ‌లు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు ఇటు కోట్ల‌, అటు జేసీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

ఈనేప‌థ్యంలో ప్ర‌జ‌ల నాడి కాంగ్రెస్‌వైపు మ‌ళ్లే అవ‌కాశం ఉంద‌ని ఓ అంచ‌నాకు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అయితే.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ప‌రిస్థితిని గ‌మ‌నించి.. కాంగ్రెస్‌తో ట‌చ్‌లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. అదేస‌మ‌యంలో వైసీపీ, టీడీపీలోకి పాత‌త‌రం కాంగ్రెస్ నాయ‌కులు సైతం.. ఆ యా పార్టీల‌కు గుడ్ బై చెప్పే అవ‌కాశం ఉంటుంద‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు. మ‌రి కోట్ల‌, జేసీ వ‌ర్గాల ఆలోచ‌న ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.