Begin typing your search above and press return to search.

కలెక్టరు - ఎస్పీలకు వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్!

By:  Tupaki Desk   |   3 May 2020 3:50 AM GMT
కలెక్టరు - ఎస్పీలకు వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్!
X
నెల్లూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి... జిల్లా కలెక్టర్ - జిల్లా ఎస్పీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేను నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు నోటీసులు ఇస్తారా? ఒక్క అధికారిని తొలగించినా ఊరుకునేది లేదు అంటూ బహిరంగ హెచ్చరిక చేశారు. ఆయన ఈ వార్నింగ్ ఎందుకు ఇచ్చారంటే...కొద్దిరోజుల క్రితం జిల్లాలోని బుచ్చిరెడ్డి పాలెంలో పేదలకు సరుకులు పంచే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉచితంగా పంచినపుడు జనం వస్తారని తెలిసి కూడా సామాజిక దూరం పాటించేలా ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. దీంతో ఆయనపై లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన నేరం కింద కేసు నమోదు చేశారు. ఆ మరుసటి రోజే నల్లపురెడ్డి తనపై కేసు తీసేయాలని ధర్నా కూడా చేశారు. తాజాగా తన కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు నోటీసులు ఇవ్వడంతో ఆయన ఆ అధికారులతో పాటు మీడియా ముందుకు వచ్చి కలెక్టరుకు వార్నింగ్ ఇచ్చారు.

ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు రూల్స్ తెలియవా... ఆ రోజు నేను పిలిస్తేనే అధికారులు వచ్చారు. సార్ ఎక్కువ మంది వచ్చారు. త్వరగా పూర్తి చేయాలని వారు నాకు సలహా కూడా ఇచ్చారు. వారు బాధ్యతగా ఉన్నారు. మీరు రాజకీయం చేయడానికి ఉన్నారా? నాకు రూల్స్ చెప్తారా? కలెక్టరు ఎస్పీ దగ్గర నేను రూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని ఆయన అన్నారు. నాకు రూల్స్ చెప్పే కలెక్టరు 50-100 మందితో జెడ్పీ సమావేశం ఎట్లా ఏర్పాటుచేశారని ప్రశ్నించారు. నేను పిలిస్తే నా కార్యక్రమానికి వచ్చిన అధికారులపై సస్పెండ్ వేటు వేస్తే నేను ఊరుకునేది లేదన్నారు. మీరు రాజకీయాలు చేయాలనుకుంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి రాజకీయ పార్టీలోచేరండి. కానీ దాతలు ముందుకు రావాలని పిలుపునిస్తే మా బాధ్యతగా మేము వచ్చి పేదలకు సేవ చేసినందుకు నా మీద కేసులు పెడతారా? అంటూ ఆయన రెచ్చిపోయారు.

క్షేత్ర స్థాయిలో సిబ్బంది కష్టపడి పనిచేస్తుంటే ఏసీ రూముల్లో కూర్చునే కలెక్టరు ఎస్పీలకు ఏం తెలుసని ప్రశ్నించారు నల్లపురెడ్డి. కలెక్టరు - ఎస్పీ తమ మర్యాద కాపాడుకుంటే మంచిదని నేను నా నియోజకవర్గంలోనే ఉంటాను... దమ్ముంటే అరెస్టు చేస్కోండి అని సవాల్ విసిరారు. నేను పిలిచిన అధికారుల జోలికి వస్తే ఎక్కడిదాకా అయినా పోరాడతాను అన్నారు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన మాట నిజం. దీనికి వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. తప్పు తనవైపు ఉన్నపుడు కూడా... దగ్గరుండి కూడా దీనిని నివారించలేకపోయిన అధికారులకు నోటీసులు ఇవ్వడంపై ఇంత బహిరంగ రచ్చ చేయడం ఎమ్మెల్యేకి మంచిది కాదన్న వాదన వినిపిస్తోంది. సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన చిన్న సమస్యను ఇంత దాకా తెచ్చుకోవడం గమనార్హం.