Begin typing your search above and press return to search.

ఏపీ లేఖతో సారుకు ఇరిటేషన్?

By:  Tupaki Desk   |   20 May 2020 4:45 AM GMT
ఏపీ లేఖతో సారుకు ఇరిటేషన్?
X
ఆచితూచి మాట్లాడటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అస్సలు ఇష్టముండదు. విషయం ఏదైనా ముఖాముఖి అన్నట్లు ఆయన తీరు ఉంటుంది. అవతలోడు ఎవరైనా.. ఏ స్థాయి అయినా.. ఒకసారి ఫిక్స్ అయితే చాలు చెలరేగిపోవటమే. మాటకారితం.. విషయాన్ని తనకు తగ్గట్లుగా చెప్పి ప్రజల్ని కన్వీన్స్ చేసే ధోరణి ఆయనలో ఎక్కువే. ఆయన్ను ద్వేషించేవారు సైతం.. ఆయన మాటలు విన్నంతనే ఓకే అనేసే పరిస్థితి. అలాంటి కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ విషయంలో మాత్రం తన తీరుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

రెండు తెలుగురాష్ట్రాల మధ్య రాయలసీమ ఎత్తిపోతలతో మొదలైన ఇష్యూ.. రోజు రోజుకి ముదురుతోంది. ఈ ఇష్యూను తెలంగాణ విపక్షాలు అందిపుచ్చుకునే ప్రయత్నంతో పాటు.. సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఆ ప్రయత్నానికి ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉండేందుకు వీలుగా ఇప్పటికే కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా ఏపీ సర్కారుతో తాను పేచీ పెట్టుకోవాలనుకునే ఉద్దేశం లేదన్న సంకేతాన్ని ఇస్తూనే.. తెలంగాణ ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న విషయాన్ని అదే పనిగా ప్రస్తావిస్తున్నారు.

ఇలాంటివేళలో ఏపీ ప్రభుత్వం రియాక్టు అవుతున్న తీరు కేసీఆర్ కు ఇరిటేషన్ తెప్పించేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎత్తి పోతల వివాదం నేపథ్యంలో కృష్ణా బోర్డుకు ఏపీ సర్కారు రాసిన లేఖ ఇప్పుడో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు, మిషన్ కాకతీయ, తుమ్మిళ్ల లాంటి ప్రాజెక్టులతో పాటు సామర్థ్యాన్ని పెంచిన కల్వకుర్తి.. నెట్టెంపాడు.. ఎస్ఎల్బీసీ లాంటి ప్రాజెక్టుల పైనా కంప్లైంట్ చేసింది.

ఏపీ చేసిన ఫిర్యాదుకు స్పందించిన కృష్ణా బోర్డు తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏపీ చేస్తున్న వాదనలకు సమాధానం ఇవ్వాలని కోరింది. ఏపీ ప్రభుత్వం సంధించిన సందేహాలకు తన అభిప్రాయాలు చెప్పాలని కోరింది. సామరస్య వాతావరణంలో ఇష్యూ క్లోజ్ చేసుకోవాలన్న తన ఆలోచనకు భిన్నంగా.. ఏపీ సర్కారు తీరు ఉండటం పై కేసీఆర్ చిరాగ్గా ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా కృష్ణా బోర్డు నుంచి వచ్చిన లేఖ.. ఆయనకు ఇరిటేషన్ తెప్పించటమే కాదు.. కేసీఆర్ లోపల నిద్రపోతున్న ఉద్యమ నేతను మరోసారి తట్టి లేపేలా ఉంటున్నాయని చెప్పక తప్పదు. మొత్తంగా ఇప్పటి పరిస్థితులకు భిన్నంగా.. రెండు రాష్ట్రాల మధ్య కొత్త వేడి రగులుకుందని చెప్పక తప్పదు.