Begin typing your search above and press return to search.

నీటి ఫైట్: ఏపీ ప్రభుత్వానికి భారీ దెబ్బ

By:  Tupaki Desk   |   24 Jun 2021 1:45 PM GMT
నీటి ఫైట్: ఏపీ ప్రభుత్వానికి భారీ దెబ్బ
X
ఏపీ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులను ఆపేయాలని కృష్ణ రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ఫొటోలు, సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేసిన ఫొటోలను ఏపీ నీటి పారుదలశాఖ కార్యదర్శికి పంపింది. ఏపీలో రాయలసీమ ఎత్తిపోతల పనులు సాగుతున్నాయని.. వెంటనే ఆపేయాలని కృష్ణా బోర్డు ఆదేశించింది.

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వెంటనే ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సమర్పించాలని.. డీపీఆర్ ఆమోదం పొందే వరకు వేచి ఉండాలని లేఖలో ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు కోరింది. ఈ ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్.జీ.టీ) ఉత్తర్వులను, తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను కూడా కృష్ణా బోర్డు ఉదహరించింది.

ఇప్పటికే కృష్ణాబోర్డుపై ఏపీ ప్రభుత్వం ఆరోపణలు గుప్పించింది. కృష్ణా బోర్డులో కొద్దిమంది సభ్యులు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోలేదని ఏపీప్రభుత్వం గతంలో ఆరోపించింది. దీనికీ కృష్ణా బోర్డు కూడా బదులిచ్చింది. ప్రాజెక్టును సందర్శించానుకునే నిపుణుల ప్యానల్ తో ఏపీ ప్రభుత్వం కూడా సహకరించలేదని కృష్ణాబోర్డు పేర్కొంది.

రాయలసీమ, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ప్రాజెక్టు అక్రమమని తెలంగాణ మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కృష్ణా బోర్డు సైతం వెంటనే ఆ ప్రాజెక్టులు ఆపాలని లేఖ రాయడం ఏపీ సర్కార్ కు మింగుడు పడడం లేదు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఫిర్యాదు చేయడం.. కృష్ణా బోర్డు ఆదేశాలు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.