Begin typing your search above and press return to search.

కృష్ణా నదిపై కట్టి పడేసే కరకట్ట

By:  Tupaki Desk   |   7 Sep 2015 5:51 PM GMT
కృష్ణా నదిపై కట్టి పడేసే కరకట్ట
X
కృష్ణా నది కుడి వరద కట్టను ప్రకాశం బ్యారేజీ నుంచి అమరావతి వరకు విస్తరించేందుకు సీఆర్ డీఏ ప్రతిపాదించింది. ప్రస్తుతం కరకట్ట మీద ఉన్న నాలుగు మీటర్ల రోడ్డును 23 మీటర్లకు అంటే 75 అడుగులకు విస్తరించాలని భావిస్తోంది. దీంతో అమరావతికి రోడ్డు కనెక్టివిటీ పెరగడంతోపాటు పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తోంది. అంతేనా.. అమరావతి రాజధాని నగరంలో త్వరలో నివసించబోయే కోటి మంది జనాభాకు వరద ముప్పు ముంపు కూడా ఉండదని వివరిస్తోంది.

ఇప్పుడు ఎవరైనా విజయవాడ నుంచి నవ్యాంధ్ర రాజధాని ప్రాంతానికి వెళ్లాలంటే కుడి వరద కట్టే దారి. అయితే అది చాలా చిన్నది. ఒక వాహనం వెళితే మరొక వాహనం వెళ్లలేదు. కానీ, అమరావతి రాజధానిని నిర్మిస్తే ఇదే అత్యంత కీలక రహదారి కానుంది. కృష్ణా నదిలో నిర్మించనున్న రెండు మూడు బ్యారేజీలకు కూడా ఇదే అనుసంధానం కానుంది. ఇక్కడికి రానున్న రెండు జాతీయ రహదారులకూ ఇది కీలకం కానుంది. విజయవాడ నుంచి అమరావతి వరకు దాదాపు 36 కిలోమీటర్ల పొడవున ఉన్న కరకట్టను ఆనుకునే అమరావతి రాజధాని నగరం మొత్తం రానుంది. సీడ్ కేపిటల్ తోపాటు వాటర్ ఫ్రంట్ లు ఇతర పర్యాటక ప్రదేశాలు దీనిని ఆనుకునే రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్రాంతి గృహం కూడా ఇప్పుడు ఇక్కడే ఉంది.

ఇప్పుడు సీఎం రెస్ట్ హౌస్ కోసం దీనిని విస్తరిస్తున్నారు. దీనిని కరకట్ట విస్తరణే శాశ్వత పరిష్కారమని సీఆర్ డీఏ భావిస్తోంది. విస్తరించిన తర్వాత కరకట్ట పొడవునా అందమైన గోపురాలు, పర్యాటకాభివృద్ధికి సంబంధించిన నిర్మాణాలు చేయాలని భావిస్తోంది.