Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల మీద ‘కృష్ణా’ యుద్ధం

By:  Tupaki Desk   |   22 Jun 2016 4:09 AM GMT
తెలుగు రాష్ట్రాల మీద ‘కృష్ణా’ యుద్ధం
X
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదం తీవ్ర రూపం దాల్చినట్లే. కృష్ణా జలాల పంపిణీ.. పర్యవేక్షణపై రెండు తెలుగు రాష్ట్రాలతో కేంద్ర జలవనరుల శాఖ సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు తమ తమ వాదనల్ని బలంగా వినిపించారు. రెండు వర్గాలు తమ తమ వాదనల మీదనే నిలబడటం తప్పించి.. ఒక్క అడుగు వెనక్కి వేసేందుకు ఎవరికి వారు సిద్దంగా ఉండటంతో మంగళవారం జరిగిన సుదీర్ఘ చర్చ ఒక కొలిక్కి రాలేదు. దీంతో.. ఈ రోజు (బుధవారం) కూడా చర్చలు జరపాలని నిర్ణయించారు. దాదాపు 14.30 గంటల పాటు (ఉదయం 8గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు) చర్చలు సాగినా విషయం ఒక కొలిక్కి రాకపోగా కొత్త పీటముడులు పడినట్లుగా చెప్పొచ్చు. మూడు దఫాలుగా సాగిన ఈ చర్చ ఏ అంశంపైనా స్పష్టత తీసుకురాకపోవటం గమనార్హం.

ఏపీ వాదనను తెలంగాణ అధికారులు తప్పు పట్టి.. వారి మాటకు నో అని చెప్పేస్తే. తెలంగాణ వాదనను అంతే బలంగా తిప్పి కొట్టిన ఏపీ అధికారులు.. వారి మాటకు తాము ససేమిరా అనేశారు. మరి.. ఈ వివాదంపై ఇరు వర్గాల వాదనను చూస్తే..

అంశాల వారీగా రెండు రాష్ట్రాల అధికారుల వాదనలు ఎలా సాగాయంటే..

1. కృష్ణా బోర్డు పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయాలని ఏపీ కోరితే.. నీటి కేటాయింపులు తేలకుండా పరిధిని నిర్ణయిస్తే ఏం లాభం అంటూ తెలంగాణ వాదించింది. ప్రస్తుతానికి రెండు నెలల పాటు నీటి కేటాయింపుల విషయాన్ని పక్కన పెట్టి నీటి వినియోగానికి సంబంధించి నిర్ణయం తీసుకుందామని.. తర్వాత పరిధిపై చర్చిద్దామని తెలంగాణ అధికారుల మాటకు ఏపీ నో అనేసింది.

2. బోర్డు పరిధిని నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేయని పక్షంలో తమ భూభాగంలో ఉన్న నాగార్జున కుడికాలువ హెడ్ వర్క్స్ ను తాము నిర్వహించుకుంటామని ఏపీ తేల్చి చెప్పింది. ఎవరి భూభాగంలో ఉన్నది వారే నిర్వహించుకుంటే సరిపోతుందని ఏపీ వాదించింది. బోర్డు జారీ చేసిన ఆదేశాల ప్రకారం నీటిని విడుదల చేయించుకోవటానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఏపీ వాదించగా.. ఆలస్యమే జరిగింది తప్పించి మరింకేమీ లేదని తెలంగాణ చెప్పింది. ఈసారికి అలాంటి ఆలస్యం లేకుండా నీటిని రెండు రాష్ట్రాలు వినియోగించుకుందామని తెలంగాణ అధికారులు పేర్కొనగా.. ఏపీ అందుకు సానుకూలంగా స్పందించలేదని చెబుతున్నారు.

3. ఎడమ కాలువ కింద ఏపీ వాటాకు నీళ్లు అసలు రాకపోవటం.. కుడికాలువకు నీటిని విడుదల చేయటంలో జరిగిన ఆలస్యంపై ఏపీ పదే పదే ప్రస్తావించింది. దీనికి కౌంటర్ గా ప్రస్తుతం శ్రీశైలం ఏపీ నిర్వహణలో ఉంటే.. నాగార్జునసాగర్ తెలంగాణ నిర్వహణలో ఉందని.. మొత్తం ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకే వస్తాయే తప్పించి.. ఒక కాలువ ఒక రాష్ట్రం పరిధిలోకి ఎలా తెస్తారని తెలంగాణ ప్రశ్నించింది.

4. జూరాలా.. శ్రీశైలం.. నాగార్జునసాగర్.. పులిచింతల.. ప్రకాశం బ్యారేజీ.. కేసీ కాలువ ఇలా అన్నింటిని బోర్డు పరిధిలోకి తేవాలని తెలంగాణ అధికారులు వాదిస్తే.. అందుకు తమకేం అభ్యంతరం లేదని ఏపీ అధికారులు చెప్పారు.

5. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను ట్రైబ్యునల్ పూర్తి చేశాక బోర్డు పరిధిపై నోటిఫికేషన్ ఇవ్వటం పట్ల తమకు అభ్యంతరం లేదని తెలంగాణ వాదిస్తే.. బోర్డు పరిధిని నోటిఫై చేయటం లేదంటే.. తమ భూభాగంలోని కుడికాలువ హెడ్ వర్క్స్ ను తామే నిర్వహించుకోవటం.. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలని ఏపీ స్పష్టం చేసింది.

6. ఎవరి గేట్లు వారే నిర్వహించుకోవాలని ఏపీ చెబితే.. అందుకు తెలంగాణ ససేమిరా అని చెప్పింది.

7. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా మళ్లించే 45 టీఎంసీల నీటి కేటాయింపుల గురించి తెలంగాణ ప్రస్తావిస్తే.. ఆ అంశంపై చర్చకు ఇది సరైన వేదిక కాదని ఏపీ అధికారులు వాదించారు.

8. కృష్ణా జలాల్లో ప్రస్తుతానికి ఏపీకి 512 టీఎంసీలు కేటాయించి తమకు 299 టీఎంసీలు కేటాయించారని.. అలా కాకుండా తమకు 408 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ అధికారులు వాదించారు. దీనిపై ఏపీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

9. పట్టిసీమ ప్రాజెక్టును ఏపీ నిర్మించినందున నాగార్జున సాగర్ ఎగువన తమకు 45 టీఎంసీల వాటా ఇవ్వాలని తెలంగాణ స్పష్టం చేసింది. దీనికి అంగీకరించేది లేదని ఏపీ స్పష్ట చేసింది.

10. కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులు చేపడితే.. భీమా ప్రాజెక్టుకు 20 టీఎంసీల నీటిని ఇవ్వటానికి అంగీకరించామని.. కానీ ఇప్పటివరకూ ఈ ఆధునికీకరణ పనులు చేయనందున 20 టీఎంసీల నీటిని ఇవ్వమని ఏపీ స్పష్టం చేయగా.. దీన్ని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది.