Begin typing your search above and press return to search.

స్టాంపుల కృష్ణయాదవ్ టీడీపీకి రాజీనామా

By:  Tupaki Desk   |   22 Jan 2016 10:30 AM GMT
స్టాంపుల కృష్ణయాదవ్ టీడీపీకి రాజీనామా
X
హైదరాబాద్ టీడీపీలో బలమైన నాయకుడు, మాజీ మంత్రి కృష్ణయాదవ్ పార్టీకి రాజీనామా చేశారు. ఒకప్పుడు టీడీపీలో బలమైన నేతగా గుర్తింపు పొందిన కృష్ణయాదవ్ స్టాంపుల కుంభకోణంలో చిక్కుకుని దశాబ్దకాలంపాటు తెరమరుగై మొన్నటి ఎన్నికల తరువాత మళ్లీ టీటీడీపీలో కనిపిస్తున్నారు. కొద్దిరోజులు ఒక మోస్తరు స్పీడు చూపిన ఆయన ఆ తరువాత సైలెంటయ్యారు. తెలంగాణలో, మరీ ముఖ్యంగా హైదరాబాద్ లోనూ టీడీపీకి ఒకప్పటి జోరు లేకపోవడం... పార్టీ నేతలు కూడా తలోదారిన సాగుతుండడంతో ఆయన కొద్దినెలలుగా టీడీపీలో చురుగ్గా ఉన్నట్లు కనిపించారే కానీ, ఆయన స్థాయిలో చురుగ్గా వ్యవహరించలేదు. తాజాగా గ్రేటర్ ఎన్నికల సమయంలో ఆయనకు టీడీపీకి హైదరాబాద్ లో ఎలాంటి పరిస్తితి ఉందన్నది పూర్తిగా అర్తమైపోవడంతో ఏకంగా రాజీనామా చేసేశారు. టిక్కెట్ల కేటాయింపులో తన అనుచరులకు అన్యాయం జరిగిందన్న కారణం చూపుతూ టీడీపీకి గుడ్ బై చెప్పారు.

టిక్కెట్ల కేటాయింపులో తనను పట్టించుకోలేదన్న అసంతృప్తితో ఆయన టీడీపీకి రాజీనామా చేశారని చెబుతున్నా అసలు కారణాలు వేరన్న వాదనా వినిపిస్తోంది. ఆయన కూడా అధికార పార్టీలోనో.. బీజేపీలోనో చేరాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే... టీడీపీ వర్గాలు మాత్రం కృష్ణయాదవ్ ఇప్పుడు ఏమాత్రం బలం లేని నేత అని.. ఆయన వెళ్లిపోతే వచ్చే నష్టమేమీ లేదని అంటున్నారు. మరోవైపు శేరిలింగంపల్లిలో మరో టీడీపీ నేత బండి రమేశ్ కూడా టీడీపీకి రాజీనామా చేస్తారని తెలుస్తోంది.