Begin typing your search above and press return to search.

క్రిష్ణయ్య ఇక బీసీ నాయకుడు కాదు!

By:  Tupaki Desk   |   25 May 2022 9:30 AM GMT
క్రిష్ణయ్య ఇక బీసీ నాయకుడు కాదు!
X
ఆయన బీసీ నాయకుడిగా తెలుగు రాష్ట్రాలే కాదు, జాతీయ స్థాయిలోనూ వేయి నోళ్ళతో బడుగులు తెగ పొగిడేవారు. ఆయన చేసిన ఎన్నో సామాజిక ఉద్యమాలు ఎందరిలో స్పూర్తిగా నిలిచాయి. వారిలో ఆర్తిని దూరం చేశాయి ఇదంతా రాజకీయం మకిలి అంటనంతవరకే. కానీ ఇపుడు ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ మనిషిగా మారిపోయారు. ఆయనే ఆర్ క్రిష్ణయ్య. ఇపుడు ఆయన జస్ట్ వైసీపీ నాయకుడు మాత్రమే.

ఆర్ క్రిష్ణయ్య ఒకనాడు గొంతు ఎత్తితే ప్రధాని వంటి వారిని కూడా ధాటీగా ప్రశ్నించేవారు. ఆయనకు ఎలాంటి రాజకీయ చట్రాలు అడ్డు తగలలేదు. పైగా ఆయన స్వచ్చతను కూడా ఎవరూ శంకించే పరిస్థితి కూడా అంతకంటే లేదు. అదే టైమ్ లో ఆయన బీసీల కోసం జీవితాన్ని అర్పించారు అన్న పేరు కూడా ఉండేది. ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం బీసీలు అణగారి ఇబ్బందుల పాలు అవుతున్న వేళ క్రిష్ణ గొంతు వేయి ఏనుగుల బలంగా ఉండేది.

ఆయనకు అన్ని పార్టీలలోనూ అలా మిత్రులు ఉండేవారు. సహచరులు కూడా పెద్ద ఎత్తున ఉండేవారు. ఎపుడైతే క్రిష్ణయ్య తన సామాజిక పోరాటాన్ని రాజకీయాల వైపు మళ్ళించారో అపుడే ఆయన బీసీ ప్రభలకు మసకబారడం మొదలైంది. ఆయన 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గారు. కండువా కప్పుకున్నారు. ఆ తరువాత ఆయనకు బీసీలలో కొంత సెక్షన్ దూరం జరిగింది.

ఆ తరువాత అందులో నుంచి బయటకు వచ్చి టీయారెస్ కి మద్దతు ఇచ్చారు. ఇపుడు చూస్తే వైసీపీ కండువా కప్పుకుని ఏకంగా రాజ్యసభ మెట్లు ఎక్కబోతున్నరు. వీటిని చూసిన వారు ఆర్ క్రిష్ణయ్య ఇపుడు అందరి క్రిష్ణయ్య మాత్రం కారు అనే అంటున్నారు. దీని మీదనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది. క్రిష్ణయ్య వైసీపీ కండువా ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక మీదట క్రిష్ణయ్యను ఏ విధంగా సంభోదించాలీ అంటే వైసీపీ ఎంపీగానే అని అంటున్నారు. అంటే అంతటి క్రిష్ణయ్య జస్ట్ వైసీపీ ఎంపీగానే ఉంటారన్న మాట. మరి ఇది ఆయన ఎదుగుదల అంటే ఆయనతో పాటు అభిమానులు కూడా ఆలోచించుకోవాల్సిన సందర్భం అనే చెప్పాలి.

ఒక విధంగా రాజకీయాల్లో చూస్తే పదవులు అశాశ్వతం. అక్కడ కప్పుకున్న కండువాలు కూడా అంత అశాశ్వతం. అయితే సామాజిక ఉద్యమాలు చేసిన వారు, పేదల తరఫున నిలబడిన వారు జనాల గుండెలలో చిరకాలం నిలిచిపోతారు. అలాంటి వారికి ప్రజల హృదయ పీఠాలే స్థిరమైన పదవులుగా ఉంటాయి.

కానీ ఆర్ క్రిష్ణయ్య మాత్రం దాన్ని వదిలేసి అందలాల కోసం చూశారు. వైసీపీ కండువా కప్పుకున్నారు అందుకే ఆయన ఇపుడు జస్ట్ ఎంపీ మాత్రమే అని బడుగులు అనుకుంటే తప్పు వారిది కాదు సుమా అన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి చూస్తే క్రిష్ణయ్య వైసీపీ కండువాతో వెరైటీగా ఉన్నారు అని సెటైర్లు కూడా పడుతున్నాయని అంటున్నారు.