Begin typing your search above and press return to search.

క్రిష్ణం రాజుకు కోసం జగన్ సర్కార్ ...?

By:  Tupaki Desk   |   29 Sep 2022 3:30 PM GMT
క్రిష్ణం రాజుకు కోసం జగన్ సర్కార్ ...?
X
వెండి తెర రెబెల్ స్టార్ గా క్రిష్ణం రాజు దాదాపుగా ఆరు దశాబ్దాల పాటు నటుడిగా ఏలారు. ఆయన కేవలం నటుడే కాదు, రాజకీయాల్లోనూ ప్రవేశించి అక్కడా సత్తా చాటారు. వాజ్ పేయ్ ప్రభుత్వంలో మూడేళ్ల పాటు సహాయ మంత్రిగా వివిధ కీలకమైన శాఖలను చూశారు. ఇక వ్యక్తిగా ఆయన రాజసం మానవతావాదం అందరికీ తెలిసిందే.

ఇటీవల మరణించిన క్రిష్ణం రాజు సంస్మరణ సభ ఆయన సొంత ఊరు మొగల్తూర్ లోజరిగింది. ఆ సభకు హాజరైన ఏపీ మంత్రులు క్రిష్ణం రాజుకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు చేసిన ప్రకటనలు ఆసక్తికరంగా ఉన్నాయి.

గొప్ప నటుడు అయిన క్రిష్ణం రాజు పేరిట మొగల్తూరులో రెండు ఎకరాల సువిశాల స్థలంలో ఒక అద్భుతమైన స్మృతివ‌నం ఏర్పాటు చేస్తామని మంత్రులు ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ ఆలోచనల మేరకు ఈ స్మృతివ‌నం అద్భుతంగా తీర్చి దిద్దడమే కాదు బ్రహ్మాండమైన టూరిజం స్పాట్ గా ఆ ప్రదేశాన్ని రూపకల్పన చేస్తామని కూడా వైసీపీ సర్కార్ ప్రకటించింది.

అక్కడ క్రిష్ణం రాజు విగ్రహంతో పాటు, ఆయన వాడిన దుస్తులు, ఆయన సినిమాలతో కూడిన లైబ్రరీ, ఒక ఆడిటోరియం నిర్మిస్తామని పేర్కొన్నారు. చెప్పడానికి వినడానికి ఇదంతా బాగానే ఉంది. క్రిష్ణం రాజుకు ఈ విధంగా నివాళి అర్పిస్తే సంతోషమే. ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రజలు అంతా సంతోషిస్తారు. కానీ ప్రభుత్వం ఎప్పటిలోగా చేస్తుంది, దానికి సంబంధించి కార్యాచరణ ఏమిటి అన్నవి ముందు ముందు చూడాలి.

ఏది ఏమైనా క్రిష్ణం రాజు రాజకీయ నాయకుడు కావడంతో ఆయన చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయని అంటున్నారు. గోదావరి జిల్లాల్లో క్షత్రియుల ప్రభావం అత్యధికంగా ఉంటుంది. దాంతో వైసీపీ ఈ దిశగా ఆలోచించి ఈ ప్రకటన చేసిందా అన్న చర్చ వస్తోంది. ఇప్పటికే నర్సాపురం రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు విషయంలో వివాదం పెట్టుకుని వైసీపీ ఆ సామాజికవర్గానికి కొంత చెడ్డ అనిపించుకుంది.

ఇపుడు క్రిష్ణం రాజు రూపేణా వచ్చిన అవకాశాన్ని తీసుకుని తిరిగి క్షత్రియుల మద్దతు పొందే ప్రయత్నం అయితే చేస్తున్నారు అని చెబుతున్నారు. మరి ఇదే ఆలోచన అయితే ఏం జరుగుతుందో చూడాలి. ఇవన్నీ పక్కన పెట్టి చూస్తే నిజంగా స్మృతివ‌నం నిర్మిస్తే మాత్రం అది ఒక చక్కని తెలుగు నటుడికి అందించే ఘనమైన నివాళి అవుతుంది అని చెప్పకతప్పదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.