Begin typing your search above and press return to search.

రెబెల్ + రెబెల్ ... ఓట్లు రాలడం నిజమేనా?

By:  Tupaki Desk   |   9 April 2018 9:49 AM GMT
రెబెల్  + రెబెల్ ... ఓట్లు రాలడం నిజమేనా?
X
కర్నాటకలో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించి.. మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణంలో మార్పు వస్తున్నదనే ప్రచారానికి చెక్ పెట్టాలని భారతీయ జనతా పార్టీ నాయకులు నానా కష్టాలు పడుతున్నారు. కర్నాటక ఎన్నికల బరిలో తమకు ఆశ పుట్టించే ఏ చిన్న అవకాశం దొరికినా వారు దానిని చేజార్చుకోవడం లేదు. చివరికి కాంగ్రెస్ పార్టీనే పక్కన పెట్టేసిన... ఒకనాటి సినీ నటుడు - ప్రస్తుతానికి మాజీ మంత్రి అంబరీష్ ను భాజపాలో చేర్చుకుని ఎన్నికల సమరంలో ముందుకు వెళ్లాలని ఆశపడుతుండడం చిత్రంగా కనిపిస్తోంది.

కర్నాటక రాష్ట్రంలో ఒకనాటి సినీ హీరో అంబరీష్ కు అక్కడ రెబెల్ స్టార్ గా పేరుంది. అదే తరహాలో తెలుగునాట రెబెల్ స్టార్ ఇమేజి ఉన్న కృష్ణం రాజు భాజపా నాయకుడే. ఆయన పేరుకు రెబెల్ స్టారే గానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఓట్లు రాల్చగల ఇమేజిని ఆయన ఎన్నడో కోల్పోయారు.

అలాంటి పరిస్థితుల్లో ఈ తెలుగు రెబెల్ స్టార్ - ఆ కన్నడ రెబెల్ స్టార్ తో మంతనాలు జరిపి పార్టీలోకి వచ్చేలా సెట్ చేశారని వార్తలు వస్తున్నాయి. తెలుగు రెబెల్ స్టార్ కన్నడ సీమలో ఎన్నికల ప్రచార బాద్యతలు కూడా పార్టీ తరఫున పర్యవేక్షిస్తున్నాడండోయ్. జోగీ జోగీ రాసుకుంటూ బూడిద రాలుతుందని సామెత! అలాగే రెబెల్ ప్లస్ రెబెల్ కలిస్తే.. వారి కళ్లలోంచి నిప్పులు రాలవచ్చేమో గానీ.. ఓట్లు రాలుతాయా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మోడీ పార్టీ అవినీతిని తాము ఎట్టి పరిస్తితుల్లోనూ సహించం అని సుద్దులు చెబుతుంటుంది. అలాంటిది.. కాంగ్రెస్ పార్టీనే అవినీతి ఆరోపణలపై మంత్రి పదవినుంచి తొలగించిన అంబరీష్ ను ఎలా అక్కున చేర్చుకుంటుంది అనే వాదన వినిపిస్తోంది. తాను సిఫారసు చేసిన నలుగురు అనుచరులకు టికెట్లు నిరాకరించారని.. అంబరీష్ కాంగ్రెస్ పై అలిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఆ నలుగురికీ పెద్దపీట వేయడానికి భాజపా సిద్ధంగానే ఉన్నదా.. స్థానికంగా పార్టీలో అసంతృప్తి రేగదా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.