Begin typing your search above and press return to search.

కేటీఆర్‌కు ఆ క్రికెట‌ర్ ఫిదా అయిపోయాడే!

By:  Tupaki Desk   |   15 Oct 2017 4:42 AM GMT
కేటీఆర్‌కు ఆ క్రికెట‌ర్ ఫిదా అయిపోయాడే!
X
ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న‌ యంగ్ అండ్ డైన‌మిక్ నాయ‌కుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌యుడు, ఐటీ మంత్రి కేటీఆర్ ముందు వ‌రుస‌లో ఉంటారు. తండ్రి అడుగు జాడల్లో న‌డుస్తూ.. తండ్రి మాట తీరును పుణికిపుచ్చుకుని రాజ‌కీయాల్లో దూసుకుపోతున్నారు. యూత్ ఐకాన్‌గానూ మారిపోతూ అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటున్నారు. ఇప్పుడు ఆయ‌న‌కు ఊహించ‌ని వ్య‌క్తి నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి! మైదానంలో చిచ్చ‌ర‌పిడుగులా దూసుకుపోయిన అల‌నాటి భార‌త వెట‌ర‌న్ క్రికెట‌ర్.. కేటీఆర్ ప‌నితీరుకు ఫిదా అయిపోయాడు. కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తేసినంత ప‌నిచేశాడు.! ఆయ‌న మ‌రెవ‌రో కాదు కృష్ణ‌మాచారి శ్రీ‌కాంత్‌!!

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు. మంత్రి కేటీఆర్ యంగ్ అండ్ డైనమిక్ అంటూ కితాబులిచ్చారు. వ‌రంగల్ అర్బ‌న్ జిల్లాలో టాస్క్ ప్రాంతీయ కేంద్రం ప్రారంభోత్స‌వంలో మంత్రి కేటీఆర్‌, క్రికెట‌ర్ కృష్ణ‌మాచారి శ్రీ‌కాంత్ పాల్గొన్నారు. ఇందులో మాట్లాడిన శ్రీ‌కాంత్‌.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంతో పాటు కేటీఆర్‌ను ఆకాశానికి ఎత్తేశారు. తెలంగాణలో ప్రభుత్వ పథకాలు బాగున్నాయని అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ముందుందన్నారు. కేటీఆర్ యంగ్ అండ్ డైనమిక్ అని, ఆయన కెప్టెన్సీలో క‌చ్చితంగా విజయం సాధిస్తారన్నారు. విద్యార్ధులు కోహ్లి, ధోనీలా ఎదగాలంటే లక్ష్యం కోసం కష్టపడాలని అన్నారు.

జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు ధీటుగా ఎదుర్కోవాలని యువతకు కేటీఆర్‌ సూచించారు. జీవితంలో రాణించాలంటే మానసికంగా, ధృఢంగా ఉండాలని అప్పుడే ఏదైనా సాధించగలమని స్పష్టం చేశారు. చదువుకునే సమయంలోనే అన్ని రక్షాల శిక్షణ పొందితేనే జీవితంలో రాణిస్తామని విద్యార్థులకు సూచించారు. త్వరలోనే వరంగల్‌లో ఐటీ పార్క్, టెక్స్‌టైల్స్ పార్క్‌ను నెలకొల్పుతున్నామన్నారు. త్వరలో మడికొండలో రూ. 25 కోట్లతో ఐటీ టాస్క్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ఇక నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందేనని కేటీఆర్ ట్విటర్ లో తెలిపారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వ‌స్తున్నందున నగరంలో పలుచోట్ల నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ విషయంపై ఓ నెటిజన్ ఫ్లెక్సీలను నిషేధించడం అధికార పార్టీకి వర్తించదా? అని ట్వీట్ చేశారు. దీనికి మంత్రి స్పందిస్తూ... అలాంటి మినహాయింపులు ఏమీ ఉండవని రీ ట్వీట్ చేశారు. వెంటనే ఫ్లెక్సీలను తొలిగించాలని వరంగల్ మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.