Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల‌ 'నిద్ర నిర‌స‌న‌'.. అసెంబ్లీలోనే.. ఎక్క‌డ? ఎందుకు?

By:  Tupaki Desk   |   18 Feb 2022 8:33 AM GMT
ఎమ్మెల్యేల‌ నిద్ర నిర‌స‌న‌.. అసెంబ్లీలోనే.. ఎక్క‌డ?  ఎందుకు?
X
నిర‌సన వ్య‌క్తం చేయ‌డంలో ఎమ్మెల్యేలు కూడాఎవ‌రికీ త‌గ్గ‌ర‌ని చాటి చెప్పారు.. క‌ర్ణాట‌క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. గురువారం రాత్రంతా వారు `నిద్ర నిర‌స‌న‌` పేరుతో రాష్ట్ర‌ అసెంబ్లీలోనే గ‌డిపారు. ఇలా ఒక‌రు కాదు ..ఇద్ద‌రు కాదు.. ఎమ్మెల్యేలు అంద‌రూ మూకుమ్మ‌డిగా నిర‌స‌న తెల‌ప‌డం సంచ‌ల‌నంగా మారింది. విష‌యంలోకి వెళ్తే.. తాజాగా జ‌రుగుతున్న బ‌డ్జెట్ స‌మావేశాల్లో జాతీయ జెండాను ఉద్దేశించి కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

దీంతో రాష్ట్ర అసెంబ్లీలో తీవ్ర దుమారం రేగింది. దీని పై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ స‌భ్యులు.. మంత్రి పదవికి రాజీనామా చేయాలని పట్టుబట్టారు. అయితే.. వివాదం జ‌రుగుతున్న స‌మ‌యంలోనే స‌భ‌ను నాలుగు సార్లు వాయిదా వేశారు.

అయిన‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ స‌భ్యులు వెన‌క్కి త‌గ్గ‌లేదు. మ‌రోవైపు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా మిగతా మంత్రులంతా ఈశ్వరప్ప వ్యాఖ్యలను సమర్థించారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. మ‌రింత ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో రాత్రంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే ఉండి నిరసన వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం యడ్యూరప్ప... కాంగ్రెస్ పక్ష నేత సిద్ధరామయ్యతో గంటకు పైగా చర్చలు జరిపినా ఫలించలేదు. ప్రతిపక్ష పార్టీ నేతలకు దాదాపు రెండు గంటలపాటు నచ్చజెప్పే ప్రయత్నం చేశాం. అసెంబ్లీలో నిద్రపోవద్దని కూడా సూచించాం. మేం శతవిధాలా ప్రయత్నించాం. కానీ వాళ్లు అంగీకరించలేదు. రేపు వాళ్లతో మరోసారి మాట్లాడుతాం అని మాజీ సీఎం య‌డియూర‌ప్ప చెప్పారు.

ఇదిలావుంటే, అసెంబ్లీలో నిద్ర నిర‌స‌న తెలిపిన కాంగ్రెస్‌ సభ్యులకు అధికారులు భోజన సౌకర్యం, వసతి కల్పించారు. పరుపులు, దిండ్లు ఏర్పాటు చేశారు. ఒక‌వైపు హిజాబ్‌తో రాష్ట్ర ప్ర‌భుత్వానికి త‌ల‌బొప్పి క‌డుతున్న స‌మ‌యంలో ఇప్పుడు జాతీయ జెండా వివాదం మ‌రింతగా ప్ర‌భుత్వానికి సెగ పెడుతోంది. మ‌రి ఇది ఇన్ని మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.