Begin typing your search above and press return to search.

కేటీఆర్‌ అమెరికాలో కొత్త రాజ‌కీయం

By:  Tupaki Desk   |   7 Jun 2016 10:30 AM GMT
కేటీఆర్‌ అమెరికాలో కొత్త రాజ‌కీయం
X
ఆయా దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు ముఖ్యంగా తెలుగువారు తమ మాతృదేశంపైన - పుట్టిన రాష్ట్రంపైన ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు ఏడాదికో - రెండేండ్ల కోసారి సభలు నిర్వహిస్తూ ఉంటారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు అమెరికాలో తెలుగు మహాసభలు జరిగేవి. వాటికి రాజకీయాలతో సంబంధం ఒకింత త‌క్కువ‌గానే ఉండేది కాదు. ఆ కమిటీల ఆహ్వానం మేరకు ముఖ్యులు వారిచ్చిన ఆతిథ్యం మేరకు వెళ్లి వచ్చేవారు. రాష్ట్రం రెండుగా విడిపోవడంతో ఇప్పుడు ప్రత్యేకంగా అమెరికాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ - తెలంగాణ సభలు పేరిట ఈ ఏడాది నుంచే నిర్వహిస్తున్నారు. ఇందులో కొత్త ప‌ద‌నిస‌లు చేసుకోవ‌బోతున్నాయి.

తెలంగాణ డెవలప్‌ మెంట్‌ ఫోరం స‌మావేశాల‌కు హాజ‌రు పేరుతో అమెరికా వెళ్లిన నేత‌లు అక్క‌డ ఒకింత రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నార‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ఆహ్వాన సంఘం పిలుపు మేరకు అధికార టీఆర్‌ ఎస్‌ పార్టీతో పాటు కాంగ్రెస్‌ నేతలు ఎక్కువమంది ఈ సభలకు హాజరయ్యారు. టీఆర్ ఎస్ లోక్‌ స‌భ ప‌క్ష నేత జితేంద‌ర్‌ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీగ‌ల కృష్ణారెడ్డి - ప‌లువురు ఎమ్మెల్యేలు వెళ్లారు. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీనుంచి తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమకుమార్‌ రెడ్డి - మాజీ మంత్రి డీకే అరుణ - ఎమ్మెల్యేలు సంపత్‌ - రామ్మోహనరెడ్డి తదితరులు హాజరయ్యారు. తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమెరికాకు వెళ్లివ‌చ్చారు. ఇదే సందర్భంలో ఐటీ - పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కూడా కొద్దిరోజులుగా అమెరికా పర్యటనలోనే ఉన్నారు. పెట్టుబడులు - అంతర్జాతీయ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించేందుకు కేటీఆర్‌ అమెరికాకు వెళ్లినా - తాము సభల నిర్వాహకుల ఆహ్వానం మేరకు వెళ్లినట్టు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నా ఈ సందర్భంగా రాజకీయాలకు తెరలేసిందని సమాచారం.

టీఆర్‌ ఎస్‌ లో చేరికలపై కేటీఆర్‌ తో కాంగ్రెస్ నేతలు చర్చించుకున్నట్టు తెలిసింది. అధికారపార్టీలోకి రావాలని కూడా ఈ సందర్భంగా కేటీఆర్‌ వారికి చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో ఉన్న టీఆర్‌ ఎస్‌ నేతలతో ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తామని, వచ్చిన వారికి కావాల్సిన రీతిలో గుర్తింపు ఉంటుందని భరోసా కల్పించినట్టు తెలిసింది. డీకే అరుణ - సంపత్‌ - రామ్మోహన్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వారంతా టీఆర్‌ ఎస్‌ లో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. తేదీలు - వారాలు కూడా ఖరారు చేసుకున్నా ఇతర కారణాల వల్ల ఆగినట్టు గుసగుసలు వినిపించాయి. ఈ నేతలు మాత్రం ఈ విషయాలను ధ్రువీకరించలేదు. పార్టీ మారేది లేదన్న నేతలంతా మరుసటి రోజే మారిన సందర్భాలు ఉన్నాయి. తిరుపతిలో మహానాడు ముగిసిన రెండురోజులకే మల్కాజిగిరి నియోజకవర్గ టీడీపీ ఎంపీ మల్లారెడ్డి గులాబీ కండువా కప్పుకున్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు ఈ సంద‌ర్భంగా గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు కూడా చేరికలను ఖండిస్తున్నా ఏదో ఒక సందర్భంలో చేరడం ఖాయమన్న ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌ - వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి టీఆర్‌ ఎస్‌ పై విమర్శలు చేసినా, ఆ వెంట‌నే పార్టీలోనే చేరడం గమనార్హం. ప్రస్తుతం కాంగ్రెస్‌ నుండి టీఆర్‌ ఎస్‌ లోకి మారబోతున్నట్టు వినిపిస్తున్న నేతలు అమెరికాలో కేటీఆర్‌ తో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.