Begin typing your search above and press return to search.

కేటీఆర్‌ కు ప్ర‌మోష‌న్‌...హ‌రీశ్‌ కు డిమోష‌న్‌

By:  Tupaki Desk   |   25 April 2016 4:44 PM GMT
కేటీఆర్‌ కు ప్ర‌మోష‌న్‌...హ‌రీశ్‌ కు డిమోష‌న్‌
X
తెలంగాణ కేబినెట్‌ లో మార్పులు చేస్తూ నిర్ణ‌యం వెలువ‌డింది. ఐదుగురు మంత్రుల శాఖలలో మార్పులు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆస‌క్తిక‌రంగా సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్‌ కు ప్ర‌మోష‌న్ ద‌క్క‌గా...ఆయ‌న‌ మేన‌ల్లుడు హ‌రీశ్‌ రావుకు డిమోష‌న్ అయ్యారు. మ‌రో మంత్రి త‌ల‌సానికి సైతం అప్రాధాన్య శాఖ క‌ట్ట‌బెట్టారు.

సీఎం కేసీఆర్ త‌న‌ త‌న‌యుడు కేటీఆర్‌ కు అత్యంత కీలకమైన పరిశ్రమల శాఖను అప్పగించారు. అంతేకాకుండా హరీష్ రావు అధీనంలో ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న కీలకమైన మైనింగ్ శాఖను కూడా కేటీఆర్‌ కే అప్పగించారు. ఇప్ప‌టివ‌ర‌కు కేటీఆర్ ప‌రిధిలో ఉన్న పంచాయతీరాజ్ శాఖను జూపల్లి కృష్ణారావుకు క‌ట్ట‌బెట్టారు. వ్య‌వ‌సాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి అదనంగా సహకార శాఖ అప్పగించారు. తలసాని శ్రీనివాస్‌ యాద‌వ్ ప‌రిధిలో ఉన్న‌ వాణిజ్య పన్నుల శాఖను సీఎం తన అధీనంలో ఉంచుకున్నారు. ఆయ‌న‌కు పశుసంవర్ధ - మత్స్యశాఖ - సినిమాటోగ్రఫీ శాఖలు అప్పగించారు.

కేసీఆర్ తీసుకున్న ఈ శాఖ‌ల మార్పు నిర్ణ‌యం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చోప‌చ‌ర్చ‌ల‌కు దారితీస్తోంది. ముఖ్యంగా హ‌రీశ్ రావు ప్రాధాన్యం త‌గ్గించి ఆయ‌న శాఖ‌ను కేటీఆర్‌ కు ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే దీనిపై హ‌రీశ్ స‌న్నిహిత వ‌ర్గాలు స‌మ‌ర్థిస్తున్నాయి. భారీ నీటిపారుద‌ల మార్కెటింగ్ - మైనింగ్ - అసెంబ్లీ వ్యహారాల శాఖలతో, మిషన్ కాకతీయ - ప్రాజెక్టులతో పనిభారం పెరిగినందున మైనింగ్ శాఖ నుంచి తనను తప్పిoచాలని మూడు నెలల క్రితమే సీఎం కేసీఆర్‌ కు హ‌రీశ్‌ రావు విజ్ఞప్తి చేశార‌ని అంటున్నారు. ఆది - సోమవారాల్లో కూడా ఇదే విషయమై సీఎంకు హరీశ్‌ రావు విన్న‌వించార‌ని స‌మ‌ర్థిస్తున్నారు.