Begin typing your search above and press return to search.

చినబాబులు ఇద్దరూ ఒకేలా చెప్పారే

By:  Tupaki Desk   |   20 Jun 2016 7:36 AM GMT
చినబాబులు ఇద్దరూ ఒకేలా చెప్పారే
X
పేరులో చంద్రుళ్లతో ఉండే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాటలు.. చేష్టలు.. వ్యూహాలు చాలా సందర్భాల్లో కలుస్తూ ఉంటాయి. ఒకసారి ఒకరు ముందు అయితే.. మరోసారి మరొకరు ముందు ఉంటారు. ఆసక్తికరంగా ఈ ఇద్దరు చంద్రుళ్లకు ఒకేలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి కూడా. ఇలా ఇద్దరి విషయంలో చాలానే పోలికలు ఉన్నట్లే.. తాజాగా వారిద్దరి వారుసల విషయంలోనూ ఒకటి మ్యాచ్ కావటం విశేషం.

ఫాదర్స్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ చెప్పిన మాటలు.. ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు లోకేశ్ మాటలు రెండూ ఇంచుమించు ఒకేలా ఉండటం గమనార్హం. ఈ ఇద్దరు చినబాబులు తమ తండ్రిని దాదాపుగా ఒకే కోణంలో చూడటం గమనార్హం.

మరి.. వారిద్దరి మాటలు ఎంత దగ్గరగా ఉన్నాయో చూసేందుకు.. వీరిద్దరి మాటల్ని వేర్వేరుగా ప్రస్తావిస్తే.. విషయం మీకు ఇట్టే అర్థమవుతుంది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ తన తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెబుతూ.. ‘‘మా నాన్న నా కోసం చేసిన త్యాగాలు నేను నాన్నను అయ్యాక తెలిసి వచ్చాయి’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తన తండ్రితో తాను దిగిన ఒక ఫోటోను.. తన పిల్లలతో తన తండ్రి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ ఫాదర్స్ డే సందర్భంగా వ్యాఖ్యానిస్తూ.. ‘‘నాపై మా నాన్న చూపిన ప్రేమ విలువ నేను తండ్రిని అయ్యాక గుర్తించాను’’ అని చెప్పారు. ఈ సందర్భంగా తన కొడుకుతో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ.. తన కొడుకు దేవాన్ష్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఇద్దరు చిన బాబులు తమ తండ్రి విషయంలో చేసిన కామెంట్లు ఒకేలా ఉండటం ఆశ్చర్యకరమే కదూ..