Begin typing your search above and press return to search.

కుమారుడు..ఇక్కడ శభాష్..అక్కడ ఖుల్లాస్

By:  Tupaki Desk   |   21 Dec 2018 4:41 AM GMT
కుమారుడు..ఇక్కడ శభాష్..అక్కడ ఖుల్లాస్
X
వారిద్దరు రాజకీయ చాణుక్యులు. ఒకరిపై ఒకరు ఎత్తులు పైఎత్తులు వేసుకునే రాజకీయ ఉద్దండులు. ఇద్దరి రాజకీయ ప్రయాణం సుదీర్ఘకాలం ఓ పార్టీలోనే జరిగింది. అదేం చిత్రమో... వారి పేర్లు కూడా దాదాపు ఒకటే. ఇప్పటికే అర్ధం అయి ఉంటుంది వారిద్దరు ఎవరో. అవును... వారే. నారా చంద్రబాబు నాయుడు - కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఈ ఇద్దరు చంద్రులు తెలుగుదేశం పార్టీలో చాలాకాలం పని చేసారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆనాటి నుంచి నారా చంద్రబుబు నాయుడుతో బద్ధ శత్రుత్వం పెంచుకున్నారు. అది వటుడింతై అన్నట్లు నానాటికీ పెరుగుతుతోంది. వీరిద్దరి మధ్య వైరంలాగే వీరిద్దరి కుమారులు కూడా అలా అలా ఎదిగి వారి వారసులుగా రాజకీయ క్షేత్రం పైకి వచ్చారు. వారే కల్వకుంట్ల తారక రామారావు - నారా లోకేష్. వీరిద్దరు తమ తండ్రుల వారసులుగా చక్రం తిప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ ఇద్దరు యువ నాయకులకు కూడా చాలా పోలికలున్నాయి. వీరిద్దరి ఉన్నత విద్య అమెరికాలోనే జరిగింది. మూడు నాలుగేళ్ల వ్యవధిలో ఇద్దరు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఒకరు తండ్రి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎదిగి మంత్రి అయ్యారు. మరొకరు తాత ప్రారంభించిన పార్టీని తండ్రి బలవంతంగా లాక్కుంటే అందులో ఎదుగుతున్నారు. వీరిద్దరికి ఆయా పార్టీలను అప్పగించి ఇక రాజకీయాల నుంచి తప్పుకోవడమో... లేదూ రాజకీయంగా జాతీయ స్ధాయిలో ఎదగడమో చేయాలని ఇద్దరు చంద్రుల ఆలోచనగా చెబుతున్నారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది. అయితే వీరి రాజకీయ ఎదుగుదల దగ్గరే చాలా తేడాలు కనపడుతున్నాయి. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత కల్వకుంట్ల తారక రామారావు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా దూసుకుపోతున్నారు. పార్టీని తన వైపు తిప్పుకుంటూ సీనియర్లను కలుస్తూ ఎదుగుతున్నారు. పైగా ఈయనకు పోటీలో ఎదురు నిలుస్తారనుకున్న మేనబావ హరీష్ రావును సైతం తన వైపు తిప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా రాజకీయంగా ఆయన ఎదుగుతున్నారు. ఇక ఆంధ్రస్రదేశ్ లో నారా లోకేష్ మాత్రం రాజకీయంగా అంత చురుకుగా ఉండడం లేదు. ఆయన చేస్తున్న రాజకీయ ప్రకటనలు - ప్రత్యర్ధులపై విసురుతున్న విమర‌్శల్లో అంత పట్టు ఉండడం లేదు. తెలంగాణలో కల్వకుంట్ల తారక రామారావుతో సోషల్ మీడియాలో నెటిజన్లు నానాటికి దగ్గరవుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నారా లోకేష్ పై సోషల్ మీడియాలో జోకులే జోకులు పేలుతున్నాయి. రెండు రాష్ట్రాల ప్రజలు ఈ తనయుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి యువ నాయకుడికి శభాష్ అంటూంటే... ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఖుల్లాస్ అంటున్నారని పరిశీలకులు చెబుతున్నారు.