Begin typing your search above and press return to search.

జైట్లీ చెప్పేందంతా అబద్దం అంటున్న కేటీఆర్-లోకేష్‌

By:  Tupaki Desk   |   17 April 2018 1:21 PM GMT
జైట్లీ చెప్పేందంతా అబద్దం అంటున్న కేటీఆర్-లోకేష్‌
X
కేంద్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ సునిశితంగా గ‌మ‌నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌తో పాటుగా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు త‌న‌యుడైన మంత్రి లోకేష్ సైతం అదే దూకుడును ప్ర‌ద‌ర్శించార‌ని అంటున్నారు. కేంద్రం స్పందించ‌డమే ఆల‌స్యం ఆ వెంట‌నే ఈ ఇద్ద‌రు మంత్రు రియాక్ట్ అవుతున్నార‌ని తాజా ఉదాహ‌ర‌ణ‌తో పేర్కొంటున్నారు. నగదు కొరతపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. దేశంలో ఉన్న కరెన్సీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం అవసరం కన్నా ఎక్కువ నగదు చెలామణిలో ఉన్నట్లు ఆయన ట్వీట్ చేశారు. బ్యాంకుల వద్ద కూడా కావాల్సిన నగదు ఉందన్నారు. కొన్ని రాష్ర్టాల్లో అనూహ్యంగా డిమాండ్ ఏర్పడడం వల్ల పాక్షికంగా నగదు లోటు ఏర్పడినట్లు ఆయన తెలిపారు.

అయితే ప్ర‌ధాని మోడీ స‌న్నిహిత మంత్రి అనే పేరున్న అరుణ్ జైట్లీ చేసిన ట్వీట్‌ పై మంత్రి కేటీఆర్ వెంట‌నే రియాక్ట‌య్యారు. బ్యాంకుల్లోనూ - ఏటీఎంల్లోనూ ఏర్పడ్డ నగదు కొరత అకస్మాత్తుగా జరగలేదని అది పాక్షికమైన అంశం కూడా కాదని మంత్రి కేటీఆర్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఆర్థిక‌మంత్రి చేసిన ట్వీట్‌ ను సూచిస్తూ కేటీఆర్ తన ట్విట్టర్‌ లో ఈ అంశాన్ని పేర్కొన్నారు. హైదరాబాద్‌ లో గత మూడు నెలలుగా నగదు కొరత గురించి ఫిర్యాదులు వింటున్నానని కేటీఆర్ తెలిపారు. ఆర్బీఐతో కలిసి ఈ సమస్యను లోతుగా అధ్యయనం చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థికశాఖను కోరారు. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

మ‌రోవైపు మంత్రి లోకేష్ సైతం ఇదే రీతిలో స్పందించారు. `కనీసం ఈ సమస్య పైనైనా వాస్తవం ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. మా రాష్ట్రంలో ఈ సమస్య ఎప్పటి నుంచో ఉందని చెప్తుంటే, రాష్ట్ర బీజేపీ నాయకులు - మా మీద విరుచుకుపడ్డారు. కనీసం ఇప్పటికైనా సమస్య పరిష్కారం చెయ్యండి` అంటూ లోకేష్ రియాక్ట‌య్యారు. గ‌తంలో అనేక సంద‌ర్బాల్లో సీఎం చంద్ర‌బాబు న‌గ‌దు కొర‌త అంశాన్ని కేంద్ర ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్లార‌ని గుర్తు చేశారు. కాగా, ఇద్ద‌రు యువ మంత్రులు ఇంత ఘాటుగా రియాక్ట‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.