Begin typing your search above and press return to search.

ఒకే వేదిక‌పై ప్ర‌సంగించ‌నున్న కేటీఆర్ - లోకేష్‌

By:  Tupaki Desk   |   30 Nov 2017 12:14 PM GMT
ఒకే వేదిక‌పై ప్ర‌సంగించ‌నున్న కేటీఆర్ - లోకేష్‌
X
తెలుగువారి ఆస‌క్తిని క‌లిగించే వార్త ఇది. ఇద్ద‌రు ప్ర‌ముఖులు - తెలుగు రాష్ర్టాల ప్ర‌ధాన పార్టీల‌ భ‌విష్య‌త్ నాయ‌కులు ఒకే వేదిక‌పై ప్ర‌సంగించే సంద‌ర్భం వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నుంది. ఆ ఇద్ద‌రే..తెలంగాణ ఐటీ - ఎన్నారై వ్య‌వ‌హారాల మంత్రి కేటీఆర్‌ - ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్‌. తెలంగాణ - ఏపీ సీఎంల త‌న‌యులైన క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు - నారా లోకేష్ ఇప్ప‌టికే మంత్రులుగా త‌మ స‌త్తాను నిరూపించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. కేటీఆర్ అయితే ఇటు ఆన్‌ లైన్‌ లో అటు ఆఫ్‌ లైన్‌ లో త‌న కంటూ భారీ స్థాయిలో ఫ్యాన్స్‌ ను క‌లిగి ఉన్నారు. ఈ ఇద్ద‌రు ఒకే వేదిక‌పై వ‌చ్చే ఏడాది ప్ర‌సంగించారు. వచ్చే ఫిబ్రవరిలో జరిగే హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 15వ వార్షికోవత్సవం ఇందుకు వేదిక కానుంది. ఈ ఇద్ద‌రు మంత్రుల‌తో పాటుగా ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు.

అమెరికాలో జరిగే అతిపెద్ద ఇండియా కాన్ఫరెన్సుల్లో హార్వర్డ్ కాన్ఫరెన్సు కూడా ఒకటి. దాదాపు వెయ్యిమందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. వివిధ రంగాల్లో రాణిస్తూ దాతృత్వం చాటుకుంటున్న ప్రముఖులు - వాణిజ్యవేత్తలు - ప్రభుత్వ అధికారులు - సహా అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ ఏడాది జరిగిన హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్సులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించిన సంగతి తెలిసిందే. కేంద్రమంత్రి సురేశ్ ప్రభు - ఎంపీ పూనమ్ మహాజన్ - సినీ నటుడు - ఇటీవలే రాజకీయ ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపిన‌ కమల్ హాసన్ - సీనియర్ జర్నలిస్టు రాజ్‌ దీప్ సర్దేశాయ్ సహా పలువురు భారత ప్రముఖులు ఈ హార్వర్డ్ కాన్ఫరెన్సుకు హాజరవనున్నట్లు తెలుస్తోంది. ఈ స‌మావేశానికి హాజ‌రుకావాల్సిందిగా ఇద్ద‌రు మంత్రుల‌కు ఆహ్వానం వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇందులో ఇప్ప‌టికే మంత్రి కేటీఆర్ త‌న అంగీక‌రం తెలుప‌గా...లోకేష్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

తాజాగా హైద‌రాబాద్‌ లో మ‌త్రి కేటీఆర్ మాట్లాడుతూ అమెరికా స‌ద‌స్సుకు హాజ‌రుకానున్న‌ట్లు వెల్ల‌డించారు. కాగా, త‌న యాత్ర‌పై మంత్రి లోకేష్ ఇంకా స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. అయితే ఇద్ద‌రు మంత్రులు హాజ‌ర‌వుతార‌ని నిర్వ‌హ‌కులు వెల్ల‌డించారు. ఇటు మంత్రి లోకేష్‌...అటు మంత్రి కేటీఆర్ హాజ‌రైతే...మంత్రివ‌ర్గ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత‌ ఇద్ద‌రు ఒకే వేదిక‌పై హాజ‌ర‌య్యే మొట్ట‌మొద‌టి స‌మావేశం ఇదే అవుతుంద‌ని అంటున్నారు.