Begin typing your search above and press return to search.

సైకిల్ తొక్క‌టంతో కేటీఆర్ ను దాటేశారే!

By:  Tupaki Desk   |   25 Sep 2018 6:23 AM GMT
సైకిల్ తొక్క‌టంతో కేటీఆర్ ను దాటేశారే!
X
కేటీఆర్ ను ఆయ‌న బీట్ చేసేశారు. అంత ద‌మ్మున్నోళ్లు తెలంగాణ‌లో ఉన్నారా? అన్న సందేహం అక్క‌ర్లేదు. ఎంతైనా రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్య‌మంత్రి అని అంద‌రూ న‌మ్ముతున్న వేళ‌.. చూస్తూ.. చూస్తూ ఫ్యూచ‌ర్ సీఎంను ఓడించే సాహ‌సం ఎవ‌రు చేసి ఉంటార‌నుకుంటున్నారా? ఇంకెవ‌రు.. తాను అమితంగా ప్రేమించి.. భ‌య‌భ‌క్తుల్ని ప్ర‌ద‌ర్శించే త‌న తండ్రికి అత్యంత స‌న్నిహితుడు.. గ‌వ‌ర్న‌ర్ సాబ్ న‌ర‌సింహ‌నే.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా నాలుగున్న‌రేళ్ల పాటు స‌చివాల‌యానికి వెళ్లిన దాని కంటే కూడా రాజ్ భ‌వ‌న్ కు రెట్టింపు సార్లు వెళ్లి ఉంటార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అలాంటి గ‌వ‌ర్న‌ర్ కేటీఆర్‌ను బీట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఇంత‌కీ కేటీఆర్ ఏంటి?. ఆయ‌న్ను గ‌వ‌ర్న‌ర్ బీట్ చేయాల‌నుకోవ‌టం ఏమిట‌న్న క‌న్ఫ్యూజ‌న్ లో ఉన్నారా? ఓకే.. క్లియ‌ర్ గా చెప్పేస్తాం చ‌దివేయండి.

అమీర్ పేట - ఎల్ బీ న‌గ‌ర్ మెట్రో మార్గాన్ని నిన్న గ‌వ‌ర్న‌ర్ చేతుల మీదుగా ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా అమీర్ పేట‌లో ఆయ‌న మొద‌టి ప్ర‌యాణాన్ని చేశారు. ఎల్ బీ న‌గ‌ర్ వ‌ర‌కు వెళ్లిన ఆయ‌న తిరిగి వ‌చ్చే క్ర‌మంలో ఖైర‌తాబాద్ వ‌ద్ద ఆగారు. అక్క‌డి నుంచి త‌న అధికారిక నిల‌య‌మైన రాజ్ భ‌వ‌న్ కు మెట్రో స్టేష‌న్ నుంచి సైకిల్ మీద వెళ్లారు. 72 ఏళ్ల వ‌య‌సులో గ‌వ‌ర్న‌ర్ సారూ సైకిల్ ఎలా తొక్కుతార‌న్న సందేహం క‌లిగినా.. తానెంత ఫిట్ గా ఉన్నార‌న్న విష‌యాన్ని త‌న సైకిల్ తొక్కే విష‌యంలో చెప్ప‌క‌నే చెప్పేశారు గ‌వ‌ర్న‌ర్‌.

గ‌వ‌ర్న‌ర్ తో పాటు తాజా మాజీ మంత్రి కేటీఆర్‌.. సీఎస్‌ జోషి - పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ - జీహెచ్ ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిశోర్‌.. హైద‌రాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.. హెచ్ ఎండీఏ క‌మిష‌న‌ర్ జ‌నార్ద‌న్ రెడ్డి ఇలా కొంద‌రితో క‌లిసి ఖైర‌తాబాద్‌ స్టేష‌న్ నుంచి రాజ్ భ‌వ‌న్ కు సైకిళ్ల మీద బ‌య‌లుదేరారు. దాదాపు కిలో మీట‌రుకు కాస్త అటూ ఇటూగా ఉండే ఈ దూరాన్ని కేటీఆర్ కంటే హుషారుగా గ‌వ‌ర్న‌ర్ సైకిల్ న‌డ‌ప‌టం ఒక ఎత్తు అయితే.. ఒక ద‌శ‌లో కేటీఆర్‌ను బీట్ చేసిన వైనం చూసి ముక్కున వేలేసుకునే ప‌రిస్థితి. 72 ఏళ్ల వ‌య‌సులో అంత ఉత్సాహంగా.. ఫిట్ గా ఉండ‌టం ఒక ఎత్తు అయితే..నిత్యం డైట్ కంట్రోల్ లో ఉంటూ.. ఫిట్ గా ఉండేందుకు ప్ర‌య‌త్నించే కేటీఆర్ ను అధిగ‌మించ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.