Begin typing your search above and press return to search.

గద్దలెవరు..గద్దెనెక్కేదెవరు..ఏపీ పాలిటిక్స్‌ లో కాకరేపుతున్న కామెంట్లు!

By:  Tupaki Desk   |   19 Jan 2019 6:58 AM GMT
గద్దలెవరు..గద్దెనెక్కేదెవరు..ఏపీ పాలిటిక్స్‌ లో కాకరేపుతున్న కామెంట్లు!
X
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతల ఆరోపణలు - ప్రత్యారోపణలతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. టీఆర్ ఎస్ - వైసీపీ మైత్రితో ఏపీ రాజకీయం కొత్త మలుపు తిరిగింది. ఈ రెండు పార్టీల సావాసం టీడీపీలో గుబులు రేపుతోంది. కేటీఆర్ - జగన్ భేటీ తర్వాత ఏపీ టీడీపీ నేతలు స్పందిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. దీనికి తోడు.. బెజవాడ దుర్గమ్మ సాక్షిగా టీఆర్ ఎస్ ఎమ్మెల్యే తలసాని చేసిన వ్యాఖ్యలు టీడీపీలో ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. సహజంగా ఇలా ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలు చేసే వ్యాఖ్యలకు అధినేతలు స్పందించరు. ఎమ్మెల్యేలు - మహా అయితే మంత్రులు మాత్రమే కౌంటర్ ఇస్తారు. కానీ.. తలసాని విషయంలో ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. ‘గతంలో మన పార్టీలో పనిచేసి ఇప్పుడు మనల్నే ఇన్నేసి మాటలంటాడా’ అన్న రీతిలో తలసాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా స్పందించడం ఈ ఎపిసోడ్‌ లో కొసమెరుపు.

చంద్రబాబు వైఖరితో ఓ విషయం మాత్రం స్పష్టమైంది. తనను ఒక్కడిని చేసి బీజేపీ - వైసీపీ - టీఆర్ ఎస్ పార్టీలు దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఎన్నికల ప్రచారంలో సానుభూతి అస్త్రాన్ని ప్రయోగించాలని చంద్రబాబు భావిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పార్టీలన్నీ కలిసి ఏపీపై గద్దల్లా వాలుతున్నాయని.. ఎంతమంది కలిసొచ్చినా ఏపీ అభివృద్ధిని అడ్డుకోలేరంటూ ఇటీవల ప్రజలనుద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు అంతేస్థాయిలో టీఆర్ ఎస్ పార్టీ కౌంటర్ ఇస్తూ తగ్గేదే లేదన్నట్టుగా సవాల్ విసురుతోంది. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం పక్కా అని పదేపదే చెబుతోంది.

వంటేరు ప్రతాప రెడ్డి టీఆర్ ఎస్‌ లో చేరిక సందర్భంగా.. టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌ గా మారాయి. చంద్రబాబు అక్కసుతో మాట్లాడుతున్నారని.. గద్దల్లా వచ్చి వాలుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారని.. ఎవరు గద్ద అని కేటీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు చాతకానితనాన్ని - అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చేసిందేమీ లేదని - చెప్పుకునేందుకు ఏమీ లేదని.. అందుకే కొత్త నాటకానికి తెరలేపారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ విషయంలో టీఆర్ ఎస్ వైఖరికి అద్దం పడుతున్నాయి. ఇక.. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే తలసాని కూడా తగ్గేలా కనిపించడం లేదు. తనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీ మీడియా పాయింట్‌ లో మాట్లాడిన తలసాని అంతేస్థాయిలో బదులిచ్చారు. ఏపీలో తాను తిరగాల్సిన ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయని - తప్పకుండా వస్తానని తలసాని చేసిన వ్యాఖ్యలు ఈ ఎపిసోడ్ ఇంకా కొనసాగుతుందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

వైసీపీ - టీఆర్ ఎస్ పార్టీలు కలిసొస్తే జనం నమ్మరని టీడీపీ విమర్శిస్తున్నపటికీ.. వైసీపీ అధినేత జగన్ మాత్రం టీఆర్ ఎస్‌ తో మైత్రి తమ పార్టీకి మేలు చేస్తుందనే భావనలో ఉన్నారు. ప్రత్యేక హోదానే ప్రచారాస్త్రంగా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలని వైసీపీ వ్యూహరచన చేస్తోంది. ప్రత్యేక హోదా కోసం రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు కలిసి ఒత్తిడి తెస్తే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా హోదా ఇచ్చి తీరాల్సిందేనని.. అందుకే టీఆర్ ఎస్‌ తో కలిసి అడుగులు వేస్తున్నామనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనేది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. హోదా విషయంలో టీఆర్ ఎస్ సానుకూలంగానే ఉందని జగన్‌ తో భేటీ అనంతరం కేటీఆర్ వ్యాఖ్యానించడం కూడా ఏపీ ప్రజల్లో సానుకూలత కోసమేనని చెప్పక తప్పదు. ఇక ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్న జనసేన అధినేత పవన్ రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

ఈ మధ్య తరచూ చంద్రబాబు సందర్భం దొరికినప్పుడల్లా బీజేపీపై పోరాడే పక్షాలన్నీ ఏకం కావాలని చేస్తున్న వ్యాఖ్యలు.. జనసేనతో పొత్తుకు సిద్ధమేనన్న పరోక్ష సంకేతాన్ని ప్రస్పుటం చేస్తున్నాయి. మరి పవన్ మరోసారి టీడీపీతో కలిసి నడిస్తే జనామోదం ఉంటుందా లేక జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందా అన్న విషయంపై ఆసక్తి రేకెత్తుతోంది. ఏదేమైనా గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మరింత రంజుగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీ - టీఆర్ ఎస్ కలిసి నడవాలని తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయ ముఖచిత్రంలో ఎలాంటి మార్పుకు కారణం కానుందోనన్న ఆసక్తి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లోనూ నెలకొంది.