Begin typing your search above and press return to search.

కేసీఆర్ కంటే ముందే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన కేటీఆర్‌!

By:  Tupaki Desk   |   16 Aug 2018 1:30 AM GMT
కేసీఆర్ కంటే ముందే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన కేటీఆర్‌!
X
తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ కే చంద్రశేఖర్‌ రావు రాష్ట్రంలో ఎన్నికల హడావుడికి తెర తీసిన సంగ‌తి తెలిసిందే.సోమవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్‌ ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయ‌న ఎన్నికల నగారా మోగించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమన్న కేసీఆర్‌.. సెప్టెంబర్ నెలలోనే తమ పార్టీ అభ్యర్థుల జాబితా వెలువరిస్తామని ప్రకటించారు. పార్టీ తరఫున ప్రగతి నివేదన సభను ఔటర్ రింగురోడ్డు సమీపంలో రాష్ట్ర చరిత్రలోనే చూడనంత భారీస్థాయిలో నిర్వహిస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరేడు సర్వేలను భిన్నమైన సంస్థలతో చేయించామని చెప్పిన కేసీఆర్.. వందకు వంద శాతం 100కుపైగా స్థానాలతో టీఆర్‌ ఎస్ ప్రభుత్వం పక్కాగా ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

అయితే ఇలా గులాబీ ద‌ళ‌ప‌తి వ‌చ్చే నెల‌లోనే అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న అని పేర్కొంటే..ఆయ‌న త‌న‌యుడు - మంత్రి కేటీఆర్ మాత్రం ఇప్పుడే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కరీంనగర్-వేములవాడ 4 లైన్ల రహదారి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఈ మేర‌కు అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ పర్యటనను ఉద్దేశించి సంక్రాంతికి గంగిరెద్దులోళ్లు వచ్చినట్టు కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడు వస్తున్నారని - గంగిరెద్దోళ్లు మంచి వాళ్లేనన్నారు. కానీ కాంగ్రెస్సోళ్లే ..ఫాళ్తు గాళ్ళు అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. నాలుగేళ్లలో రాని వాళ్లు ఇప్పుడు ఓట్ల కోసం మళ్లీ తెలంగాణకు వస్తున్నారని విరుచుకుప‌డ్డారు. రాహుల్ తన సొంత నియోజకవర్గంలో కనీసం మున్సిపాలిటీ కూడా గెలిపించుకోలేకపోయారని దుయ్యబట్టారు. అలాంటిది రాహుల్ తెలంగాణ వచ్చి ఏం చేస్తారని మంత్రి ప్రశ్నించారు. రాహుల్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ నాశనమేనన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ను తన కంటే ఎక్కువ మెజార్టీతో గెలపించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేయ‌డం వెనుక మ‌ర్మం ఏమిట‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. టీఆర్ ఎస్ పార్టీ త‌ర‌ఫున అధ్య‌క్షుడి హోదాలో అభ్య‌ర్థుల‌ను తాను ఖ‌రారు చేస్తాన‌ని కేసీఆర్ వెల్ల‌డిస్తే...అంత‌కుముందే ఆయ‌న త‌న‌యుడైన మంత్రి కేటీఆర్ క్యాండిడేట్ల‌ను ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కేటీఆర్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తే కేసీఆర్ ఏం చేయాల‌ని ఓ వైపు సందేహం వ్య‌క్త‌మ‌వుతుండ‌గా...మ‌రోవైపు ఈ ప్ర‌క‌ట‌నే రాబోయే కాలంలో కేటీఆర్ కీల‌క పాత్ర పోషించ‌నున్నార‌ని తెలియ‌జెప్పేందుకు నిద‌ర్శ‌న‌మ‌ని ఇంకొంద‌రు పేర్కొంటున్నారు.