Begin typing your search above and press return to search.

కేంద్రాన్ని క‌దిలించిన కేటీఆర్‌...టాలీవుడ్ ఫిదా

By:  Tupaki Desk   |   13 Jan 2019 1:47 PM GMT
కేంద్రాన్ని క‌దిలించిన కేటీఆర్‌...టాలీవుడ్ ఫిదా
X
టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మ‌రోమారు టాలీవుడ్‌ ను ఫిదా చేశారు. గ‌త కొద్దికాలంగా చ‌ర్చ‌నీయాంశంగా ఉన్న కీల‌క అంశంపై ఆయ‌న కేంద్రాన్ని క‌దిలించారు. నిర్మాత ఎన్నారై అన్న కారణం చూపి ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాను జాతీయ అవార్డులకు పరిగణనలోకి తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ చిత్ర నిర్మాత పరుచూరి ప్రవీణ స్వతహాగా భారతీయురాలే. కానీ అమెరికాలో స్థిరపడింది. ఆమె అక్కడి నుంచి వచ్చి పూర్తిగా ఇక్కడి నటీనటులు.. సాంకేతిక నిపుణులతో సినిమాను నిర్మించింది. నిర్మాత ఎన్నారై అనే ఒక్క కారణం చూపించి జాతీయ అవార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని నిరాకరించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే నడించింది.

ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న కేరాఫ్ కంచెరపాలెం సినిమాను జాతీయ పురస్కార నామినేషన్లకు ఎంపిక చేయకపోవడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అసంతృప్తి వ్యక్తంచేశారు. సినిమా నిర్మాత అమెరికా పౌరురాలు అనే కారణంతో నామినేషన్లకు ఎంపికచేయకపోవడం సరికాదని తప్పుపట్టారు. కేరాఫ్ కంచెరపాలెం సినిమా నిర్మాత ప్రవీణ పరుచూరి ఆవేదనను కేంద్రానికి తెలిపారు. ఫిల్మ్‌ మేకర్లందరూ నేషనల్ అవార్డు పొందటాన్ని గర్వంగా చూస్తారు. కాలంచెల్లిన నిబంధనలను అనుసరించి భారత్‌ లో నిర్మించిన చిత్రాలకు అవార్డులను తిర్కరించ డం సరికాదు అని కేంద్ర సమాచారప్రసారశాఖ మంత్రి అరుణ్ జైట్లీకి - సహాయమంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్ రాథోడ్‌ కు కేటీఆర్ ట్వీట్‌చేశారు. సినీ నిర్మాత అమెరికన్ సిటిజన్ అనే సాకుతో నేషనల్ అవార్డుకు ఎంపిక చేయలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేటీఆర్ చేసిన ట్వీట్‌ కు ప్రాధాన్యం సంతరించుకున్నది.

అంతకుముందు తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన మా సినిమా.. నేషనల్ అవార్డుకు మాత్రం అర్హత సాధించలేకపోయింది. ఎందుకంటే నిర్మాత భారతీయుడు కాకపోవడమే అంటూ చిత్ర నిర్మాణ ప్రవీణ పరుచూరి ట్వీట్‌చేశారు. కేటీఆర్ - నరేంద్రమోదీతోపాటు ప్ర ముఖ నేతలను ట్వీట్‌కు జతచేశారు. మా సినిమాను భారత్‌లోనే, భారతీయ నటులతోనే నిర్మించాం. భారత్‌లో విడుదలచేశాం. కాని వివక్ష చూపారు అని ట్విట్టర్‌ లో ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. కేటీఆర్ ట్వీట్‌కు కంచెరపాలెం సినీ బృందం - నిర్మాత ప్రవీణ కృతజ్ఞతలు తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌ లో విడుదలైన కేరాఫ్ కంచెరపాలెం చిత్రం విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేంద్రం నిర్ణయంతో నేషనల్ అవార్డుల నామినేషన్లకు ఈ సినిమా ఎంపిక కాకపోవడంపై సోషల్ మీడియాలోనూ నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు.

కాగా, కేటీఆర్ ట్వీట్‌ పై కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ స్పందించారు. తమ అధికారులు సినిమా నిర్మాత ప్రవీణతో మాట్లాడారని - నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ పొందేందుకు నిర్మాత, లేదా ఒక సహనిర్మాత అయినా భారతీయుడై ఉండాల్సిన అవసరం ఉం దని ట్విట్టర్‌లో వివరించారు. రీట్వీట్ చేసిన కేటీఆర్.. వేగంగా స్పందించినందుకుగాను రాథోడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.