Begin typing your search above and press return to search.

ట్వీట్ వార్.. రాహుల్ వర్సెస్ కేటీఆర్

By:  Tupaki Desk   |   3 Dec 2018 12:19 PM GMT
ట్వీట్ వార్.. రాహుల్ వర్సెస్ కేటీఆర్
X
ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడించింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పరస్పరం హామీల విషయంలో విమర్శలు గుప్పించుకున్నారు. కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ విరుచుకుపడ్డారు.

మొదట రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్రమోడీకి టీఆర్ ఎస్ బీ టీమ్ అని.. కేసీఆర్ తెలంగాణలో మోడీకి రబ్బర్ స్టాంప్ అని.. మజ్లిస్ బీజేపీకి సీ టీం అని ట్వీట్ చేశారు. బీజేపీ - టీఆర్ ఎస్ - మజ్లిస్ ఒక్కటేనని విమర్శించారు. దీన్ని రాహుల్ గాంధీ అందరికీ అర్థం మయ్యేలా తెలుగు - హిందీ - ఇంగ్లీష్ లలో ట్వీట్ చేశారు.

‘బీజేపీకి బీ - సీ టీంలుగా పనిచేస్తూ టీఆర్ ఎస్ - మజ్లిస్ లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలుస్తూ కమలం పార్టీకి లాభం చేకూరుస్తున్నాయని.. తెలంగాణ ప్రజలు తెలివైన వారు ఆ ముగ్గురి చేతిలో మోసపోరు ’ అని రాహుల్ గాంధీ ట్వీట్ లో విమర్శించారు.

దీనికి కౌంటర్ గా కేటీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేపర్లలో ఇస్తున్న ప్రకటనల్లో అబద్ధమాడిన విషయాన్ని, రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను ట్వీట్ చేస్తూ.. ‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లక్ష ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిందని.. కానీ రాహుల్ గాంధీ ఓ బహిరంగ సభలో వీటిని ప్రభుత్వ - ప్రైవేటు ఉద్యోగాలుగా చూపించారని ’ వీడియోతో సహా ఎండగట్టారు. ఉద్యోగాల విషయంలో మోసం చేస్తున్న కాంగ్రెస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు.

ఇక ఇళ్ల విషయంలోనూ కాంగ్రెస్ చేసిన మోసంపై కేటీఆర్ ట్వీట్ తో ఎండగట్టారు. మొదట ఇళ్లకు 5 లక్షలు ఇస్తామని మేనిఫెస్టోలో చేర్చి.. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రుణంగా ఇస్తామని కాంగ్రెస్ మాట మార్చిందని ఆదివారం దినపత్రికల్లో వచ్చిన యాడ్స్ చూపిస్తూ కేటీఆర్ నిరూపించి ఎండగట్టారు.

కేటీఆర్ లేవనెత్తిన ఈ తప్పులను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ సోమవారం యథావిధిగా పాత హామీలను ఉన్నది ఉన్నట్టు అడ్వటైజ్ మెంట్లలో పత్రికల్లో చూపించి తప్పు సరిదిద్దుకుంది.

ఇక మరో ట్వీట్ లో కేసీఆర్ సర్కారు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను ప్రైవేటు రంగంలో తీసుకొచ్చిందని.. ఈ విషయంలో రాహుల్ గాంధీ తెలుసుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలా కేటీఆర్ వర్సెస్ రాహుల్ ట్వీట్ వార్ పొలిటికల్ హీట్ ను పెంచింది.