Begin typing your search above and press return to search.

మంత్రి కేటీఆర్ వ్యూహం.. ట్యాంక్ బండ్ ప‌ర్యాట‌క ప్రాంతం కానుందా?

By:  Tupaki Desk   |   6 Sep 2021 2:30 PM GMT
మంత్రి కేటీఆర్ వ్యూహం.. ట్యాంక్ బండ్ ప‌ర్యాట‌క ప్రాంతం కానుందా?
X
హైద‌రాబాద్ ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు ప‌ట్ట‌ణాభివృద్ధి, మునిసిప‌ల్ శాఖ‌ మంత్రి కేటీఆర్ మ‌రింత బూస్ట్ ఇస్తున్నారా? న‌గ‌రానికి మ‌ణిహారం వంటి ట్యాంకుబండ్‌ను మ‌రింతగా తీర్చిదిద్దేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా ట్యాంక్‌బండ్ ను స్థానిక ప‌ర్యాట‌క ప్రాంతంగా అభివృద్ధి చేసే చ‌ర్య‌ల‌కు మంత్రి ఇప్ప‌టికే రూప‌క‌ల్ప‌న చేయ‌డం.. వాటిని అమ‌లు కూడా చేయ‌డం తెలిసిందే. వారంలో ప్ర‌తి ఆదివారం సాయంత్రం ఐదు గంట‌ల పాటు.. ట్యాంక్‌పై ట్రాఫిక్‌ను నిలిపివేయ‌డంద్వారా.. ఇక్క‌డ స్థానిక ప్ర‌జ‌లు విహ‌రించేలా.. ట్యాంక్‌బండ్ అందాల‌ను తిల‌కించేలా ఆదేశించిన విష‌యంతెలిసిందే.

ఇప్పుడు దీనికి ద‌న్నుగా మంత్రి కేటీఆర్ మ‌రిన్ని నిర్ణ‌యాలు తీసుకున్నారు. ట్యాంక్‌బండ్‌పై సంగీత‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు, క‌ళ‌ల ప్ర‌ద‌ర్శ‌న వంటివి ఏర్పాటు చేయ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల‌కు మ‌రింత ఆహ్లాదాన్ని పంచేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి ఆదేశిం చారు. `ట్యాంక్ బండ్‌ను ఒక కార్నివాల్‌గా రూపొందిద్దాం` అంటూ.. ట్వీట్ చేయ‌డం ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. సాయంత్ర వేళ‌ల్లో చిన్నారులను తీసుకువ‌చ్చి.. ఇక్క‌డ విహ‌రించేలా ఏర్పాట్లు చేయాల‌ని.. సూచిస్తూ.. మునిసిప‌ల్ ప‌రిపాల‌నాధికారి అర్వింద్‌కుమార్‌ను ట్యాగ్ చేశారు. అదేస‌మయంలో ట్యాంక్‌బండ్‌పై గ‌తంలో జ‌రిగిన కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన ఫొటోల‌ను కూడా ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

``ఆర్ట్స్‌+క్రాఫ్ట్స్‌+ మ్యూజిక్‌.. ఏర్పాటుతో ట్యాంక్‌బండ్ పై స‌రికొత్త కార్నివాల్ ఏర్ప‌డుతుంది. ఇదో గొప్ప అనుభూతిని పంచుతుంది. అదేస‌మ‌యంలో లేజ‌ర్ షోలు ఏర్పాటు చేయ‌డం ద్వారా ఇక్క‌డ విహ‌రించేవారికి క‌నుల‌పండుగ చేయొచ్చు.` అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్ప‌టికే గ‌త రెండు వారాల నుంచి ప్ర‌తి ఆదివారం.. సాయంత్రం ఐదు గంట‌ల పాటు.. ట్రాఫిక్‌ను నిలిపేసిన విష‌యం తెలిసిందే. మొత్తం మూడు కిలోమీట‌ర్లు ఉన్న ట్యాంక్ బండ్ ప‌రిస‌రాలు.. హైద‌రాబాద్‌-సికింద్రాబాద్ జంట న‌గ‌రాల‌ను క‌లుపుతున్న విష‌యం తెలిసిందే.

ఇక‌, మంత్రి ఇలా ఆదేశించారో లేదో.. అర్వింద్‌కుమార్ వెంట‌నే రంగంలోకి దిగిపోయారు. ఈ నెల 5వ తారీకు(గురు పూజోత్స‌వం), సండే కావ‌డం, ట్యాంక్‌బండ్‌ను ట్రాఫిక్ ఫ్రీ జోన్‌గా ఐదు గంట‌ల పాటు ప్ర‌క‌టించ‌డంతో న‌గ‌ర వాసులు త‌మ చిన్నారుల‌తో ఇక్క‌డ‌కు వ‌చ్చి చేరారు. సాయంత్ర వేళ‌ల‌ను ఎంతో ఆనందంగా గ‌డిపారు. ఫొటోలు తీసుకున్నారు. సాయంత్రం 5 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు పోలీసులు ఏ ఒక్క వాహ‌నాన్నీ అనుమ‌తించ‌లేదు. దీంతో ఇక్క‌డ‌కు వ‌చ్చిన కుటుంబాలు ఎంతో ఎంజాయ్ వాతావ‌ర‌ణంలో గ‌డిపాయి. సాగ‌ర్ అందాల‌ను త‌మ ఫోన్ల‌లో బంధించ‌డంతోపాటు.. సెల్ఫీలు తీసుకుని.. త‌మ చిన్నారుల‌కు సాగ‌ర్ అందాల‌ను చూపిస్తూ.. ఎంజాయ్ చేశారు.