Begin typing your search above and press return to search.

ప్ర‌చారం పూర్తి అయ్యాక కేటీఆర్ ప్ర‌చారం!

By:  Tupaki Desk   |   15 May 2016 10:00 AM GMT
ప్ర‌చారం పూర్తి అయ్యాక కేటీఆర్ ప్ర‌చారం!
X
ఖ‌మ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ప్ర‌చారం ముగిసింది. సోమ‌వారం ఉప ఎన్నిక పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఉప ఎన్నిక సంద‌ర్భంగా తెలంగాణ అధికార‌ప‌క్షం.. విప‌క్షాలు ఏ స్థాయిలో ఒకరి మీద ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎన్నిక‌ల నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన త‌ర్వాత కూడా టీఆర్ ఎస్ పార్టీ మ‌రింత దూసుకెళ్లేలా మంత్రి కేటీఆర్ త‌న ప్ర‌య‌త్నాల్ని తాను చేస్తున్నారు.

మైకులు పట్టుకొని.. గ్రామ గ్రామాన తిరిగిన కేటీఆర్‌.. ఎన్నిక‌ల కోడ్ కు అనుగుణంగా ఎన్నిక‌ల ప్ర‌చారానికి పుల్ స్టాప్ పెట్టిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన శైలిలో ఉప ఎన్నిక ప్ర‌చారం చేయ‌టం గ‌మ‌నార్హం. అయితే.. తాజాగా ఆయ‌న చేస్తున్న ప్ర‌చారం ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌కు విఘాతం క‌లిగించేలా ఉండ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌జ‌ల మీద ప్ర‌భావం చూపిస్తున్న సోష‌ల్ మీడియాను ఆయుధంగా చేసుకున్న కేటీఆర్ పాలేరు ఉప ఎన్నిక ప్ర‌చారాన్ని చేస్తున్నార‌ని చెప్పొచ్చు. ఇందుకు త‌గ్గ‌ట్లే తాజాగా ఆయ‌న ట్విట్ట‌ర్ లో ఒక ట్వీట్ చేశారు.

కారుకు ఓటేద్దాం.. కేసీఆర్ కు మ‌ద్ద‌తిద్దాం అంటూ ఆయ‌న ట్వీట్ చేసి..ఆఖ‌రి నిమిషాల ప్ర‌చారంతో క‌లిగే ప్ర‌యోజ‌నాన్ని పొందాల‌న్న భావ‌న‌లో కేటీఆర్ ఎన్న‌ట్లు కనిపిస్తోంది. సోష‌ల్ మీడియాతో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని కొన‌సాగిస్తూ టీఆర్ ఎస్ ను గెలిపించాలంటూ ఓట‌ర్ల‌ను కోరుకుంటున్నారు. పాలేరు ఉప ఎన్నిక బాధ్య‌త‌ను మంత్రి క‌మ్ కొడుకు అయిన కేటీఆర్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ బాధ్య‌త అప్ప‌గించ‌టం తెలిసిందే. ఆఖ‌రి నిమిషం వ‌ర‌కూ ఏదో ఒక ప్ర‌య‌త్నంతో పార్టీని గెలిపించాల‌ని త‌పిస్తున్న కేటీఆర్ అతృత‌ను పాలేరు ఓట‌ర్లు ఎంత‌మేర అర్థం చేసుకుంటార‌న్న విష‌యం ఈ నెల 19న తేలిపోనుంది.