Begin typing your search above and press return to search.

పౌరుషాల పురిటిగడ్డ‌లో కేటీఆర్ భారీ స‌వాల్‌

By:  Tupaki Desk   |   1 Feb 2018 5:01 AM GMT
పౌరుషాల పురిటిగడ్డ‌లో కేటీఆర్ భారీ స‌వాల్‌
X
భారీ స‌వాలు విసిరారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌. త‌న ప‌ని తీరుతో ఇంటా.. బ‌య‌టా ప్ర‌శంస‌లు అందుకుంటున్న కేటీఆర్.. రానున్న ఎన్నిక‌ల‌కు సంబంధించి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులపై తీవ్ర‌స్థాయిలో దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణలో త‌మ‌కున్న ప‌ట్టును.. ప్ర‌జ‌ల్లో త‌మ ప్ర‌భుత్వానికి ఉన్న ఆద‌ర‌ణ‌ను తాజా స‌వాల్ రూపంలో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. త‌న‌దైన మాట‌ల చ‌మ‌త్కారంతో ప్ర‌త్య‌ర్థి నోటి నుంచి మాట రాకుండా చేసేలా ఛాలెంజ్ విసిరారు. మీకు గుర్తుండే ఉంటుంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ కు జ‌రిగిన ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేటీఆర్ ఒక స‌వాల్ విసిరారు.

ఆ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ గెల‌వ‌కుంటే తాను మంత్రి ప‌ద‌విని వ‌దిలేస్తాన‌న్నాడు. గెలుపు మీద మాత్ర‌మే స‌వాలు విసిరిన కేటీఆర్ ను ఎన్ని స్థానాల్లో గెలుస్తారో చెప్ప‌గ‌ల‌రా? అంటూ ప్ర‌శ్నించిన ప్ర‌త్య‌ర్థి నేత‌ల‌కు మాట చెప్ప‌కుండా.. త‌న స‌వాల్ ను అదే ప‌నిగా రిపీట్ చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రికార్డు స్థాయిలో వార్డు మెంబ‌ర్ల‌ను గెలుచుకున్న టీఆర్ ఎస్ త‌న స‌త్తాను చాటుకుంది.

ఓప‌క్క వివిధ సంస్థ‌లు చేస్తున్న స‌ర్వేల ప్ర‌కారం.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ కు 102 స్థానాలు గెలుచుకోవ‌టం ప‌క్కా అని స్ప‌ష్టం చేస్తున్న వేళ‌.. కేటీఆర్ త‌న‌దైన శైలిలో స‌వాలు విసిరారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి ఖాయ‌మ‌ని.. ఒక‌వేళ త‌మ పార్టీ కానీ ప‌వ‌ర్ లోకి రాకుంటే తాను రాజ‌కీయ స‌న్యాసానికి సిద్ధ‌మ‌ని తేల్చేశారు. అదే స‌మ‌యంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌ కు స‌వాలు విసిరి.. తాను చేసిన ఛాలెంజ్‌ ను అంగీక‌రిస్తారా? అంటూ బంతిని ఆయ‌న వైపున‌కు నెట్టేశారు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు 70 సీట్లు ఖాయ‌మ‌ని.. త‌ప్ప‌నిస‌రిగా గెలుస్తామ‌ని చెప్పిన ఉత్త‌మ్ మాట‌ల్ని తేలిగ్గా తీసేశారు. ఒక‌వేళ కాంగ్రెస్ పార్టీ కానీ 70 సీట్లు గెలిస్తే తాను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు.

గ‌ద్వాల లోని న‌డిగడ్డ‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఉత్త‌మ్‌ కు సూటిగా స‌వాలు విసురుతూ.. టీఆర్ ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి రాక‌పోతే తాను రాజ‌కీయ స‌న్యాసం చేస్తాన‌ని.. మ‌రి నువ్వు కూడా స‌న్యాసం చేస్తావా? అంటూ స‌వాల్ విసిరారు. 2019 ఎన్నిక‌ల‌కు ఇంకా 20 నెల‌ల స‌మ‌యం ఉంద‌ని చెప్ప‌టం ద్వారా.. ముంద‌స్తు ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేవ‌న్న సంకేతాన్ని ఇచ్చారు. అయితే.. ఇది య‌థాలాపంగా చెప్పారా? వ్యూహాత్మ‌కంగా చెప్పారా? అన్న‌ది మ‌రో అంశంగా చెప్పాలి.

తిరిగి అధికారంలోకి రావ‌టంపై భారీ స‌వాలు విసిరిన కేటీఆర్ ఉత్త‌మ్‌ కు త‌న‌దైన శైలిలో చుర‌క‌లు అంటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చే వ‌ర‌కు గ‌డ్డం తీయ‌న‌ని ప్ర‌క‌టించిన ఉత్త‌మ్ ను ఉద్దేశించి.. గడ్డం పెంచుకున్న ప్ర‌తి ఒక్క‌రూ గ‌బ్బ‌ర్ సింగ్ అయిపోతారా? గ‌డ్డాలు పెంచుకుంటే అధికారంలోకి వ‌స్తామంటే అంద‌రూ పెంచుకుంటారంటూ ఎద్దేవా చేశారు.

న‌ల్గొండ జిల్లాలో 2 ల‌క్ష‌ల మంది ఫ్లోరైడ్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారంటే అందుకు కాంగ్రెస్ పార్టీ కార‌ణం కాదా? అని ప్ర‌శ్నించారు. 20 ఏళ్లుగా మంత్రులుగా చేసి రికార్డు బ‌ద్ధ‌లు కొట్టిన వారు ప్ర‌జ‌ల‌కు ఏమీ చేసింది లేద‌న్నారు. నీళ్లు ఇవ్వ‌లేని ద‌ద్ద‌మ్మ‌లుగా కాంగ్రెస్ నేత‌ల్ని అభివ‌ర్ణించారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లోనే కాదు.. దేశం మొత్తమ్మీదా గెలిచే ప‌రిస్థితి లేద‌ని వ్యాఖ్యానించారు కేటీఆర్‌. మొన్నా మ‌ధ్య హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌.. గుజ‌రాత్ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోవ‌టాన్ని ప్ర‌స్తావించిన కేటీఆర్‌.. మా రాహుల్ వ‌స్తార‌ని కాంగ్రెస్ నేత‌లు పెద్ద పెద్ద మాట‌లు చెబుతున్నార‌ని.. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గెల‌వ‌లేద‌న్న విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాల‌న్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా చిత్త‌శుద్ధితో ప‌ని చేసిందా? అని ప్ర‌శ్నించిన కేటీఆర్‌.. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌లు జైపాల్ రెడ్డి మొద‌లు.. నిన్న మొన్న పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిపైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. రేవంత్ ను రైఫిల్ రెడ్డిగా అభివ‌ర్ణించిన కేటీఆర్‌.. ఆయ‌న మాటల్ని తెలంగాణ ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితుల్లో లేర‌న్నారు. ఎన్ని సీట్లు గెలుస్తామ‌న్న విష‌యంలో స‌వాలు విస‌ర‌కుండా గెలుపు విష‌యంలో మాత్ర‌మే ఛాలెంజ్ విసిరిన కేటీఆర్ మాట‌ల‌కు ఉత్త‌మ్ అండ్ కో ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.