Begin typing your search above and press return to search.

కేటీఆర్ స‌వాల్​:​ గ్రేటర్ లో ​గెలవకపోతే రాజీనామా​

By:  Tupaki Desk   |   11 Jan 2016 10:06 AM GMT
కేటీఆర్ స‌వాల్​:​ గ్రేటర్ లో ​గెలవకపోతే రాజీనామా​
X
తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌యుడు, రాష్ర్ట మంత్రి కేటీఆర్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల‌ను టీఆర్ ఎస్‌ తో పాటు త‌ను వ్య‌క్తిగ‌తంగా ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారో చెప్ప‌క‌నే చెప్పారు. బ‌ల్దియా ఎన్నిక‌ల సంద‌ర్భంగా తెలంగాణ యూనియ‌న్ ఆఫ్ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్స్ నిర్వ‌హించిన మీట్‌ ది ప్రెస్‌ లో పాల్గొన్న‌ మంత్రి కేటీఆర్ ప్ర‌తిప‌క్షాల‌కు గ‌ట్టి స‌వాల్ విసిరారు.

గతంలోని ప‌రిపాలకుల నిర్లక్ష్యంతో హైద‌రాబాద్‌ లో అభివృద్ధి శూన్యమని, అందుకే టీఆర్ ఎస్‌ ను గెలిపించాల‌ని కోరుతున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు. దేశంలో తెలంగాణాను నెంబర్‌వ‌న్ స్థానంలో నిలిపేందుకు కేసీఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు. టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వంలోకి రాక ముందు ఎన్నో పుకార్లు తెర‌మీద‌కు వ‌చ్చాయని అయితే ఇప్పుడు కేసీఆర్‌ పై ప్రజలకు నమ్మకం ఏర్పడిందని అన్నారు. గత పాలకుల హయాంలో వారానికి రెండ్రోజులు పవర్‌ హలీడేగా ఉండేదని అన్నారు. కరెంటు సమస్యతో పారిశ్రామిక వేత్తలు రోడ్లపై ధర్నాలు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరెంటు సమస్య లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌ దేనని చెప్పారు. తెలంగాణలోని 30 శాతం జనాభా హైదరాబాద్‌ లోనే ఉందని, హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రధాన ఆర్థిక వనరుగా హైదరాబాద్ నిలుస్తోంద‌ని హైదరాబాద్‌ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామ‌ని ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా జీహెచ్‌ ఎంసీ ఎన్నికలపై కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. జీహెచ్‌ ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ ను గెలిపించకపోతే మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తానని ప్ర‌క‌టించారు. టీఆర్‌ ఎస్‌ ను గెలిపిస్తే విపక్ష నేతలు తప్పుకుంటారా? అని కేటీఆర్‌ సవాల్‌ చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎంత మంది సినీస్టార్లు వచ్చినా త‌మ‌కు అతిపెద్ద గ్లామర్‌ కేసీఆరేనని అన్నారు. త‌న‌కు మంత్రి పదవే ఎక్కువని...సీఎం పదవిపై ఆశ లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ అంటే భారతీయ జోక్ పార్టీ అని ఎద్దేవా చేశారు. మజ్లీస్‌ కూడా ఆశించిన స్థాయిలో పని చేయలేదని, పాతబస్తీ వెనుకబాటుకు ఎంఐఎం కారణమని అన్నారు. ప్రధాని న‌రేంద్ర‌మోడీ గెలిచ‌న‌ప్ప‌టి నుంచి హైదరాబాద్ ముఖం కూడా చూపెట్టలేదని, హైదరాబాద్‌ లో ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని దుయ్యబట్టారు.

మొత్తంగా త‌న స‌వాల్‌ తో గ్రేట‌ర్ ఎన్నిక‌ల వేడిని కేటీఆర్ మ‌రింత పెంచిన‌ట్ల‌యింది. ఇంత ధైర్యంగా కేటీఆర్ ప్ర‌క‌ట‌న చేశారంటే టీఆర్ ఎస్ ప‌క‌డ్బందీ ఎన్నిక‌ల వ్యూహంతో ముందుకువెళుతున్న‌ట్లేన‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.