Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్ల‌ను కూల్ చేసిన కేటీఆర్‌!

By:  Tupaki Desk   |   19 Dec 2017 5:49 AM GMT
ఆంధ్రోళ్ల‌ను కూల్ చేసిన కేటీఆర్‌!
X
న‌ష్టం జ‌రుగుతుంద‌న్న‌ప్పుడు ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత త్వ‌ర‌గా న‌ష్ట‌నివార‌ణ‌ను మొద‌లు పెట్టాల్సిందే. మాట‌ల్లో చెప్పేసినంత ఈజీ కాదు చేత‌ల్లో చేసి చూపించ‌టం. అందులోకి రాజ‌కీయాల్లో ఇలాంటివి అమ‌లు చేయ‌టంలో ఉండే క‌ష్టం అంతా ఇంతా కాదు. మాట‌ల్లో అనుకునేవి చేత‌ల్లో చేసి చూపించేట‌ప్పుడు ఉండే ఇబ్బంది అంతా ఇంతా కాదు. జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే.. అది మ‌న జీవితాల్లోనే స్ప‌ష్టంగా క‌నిపిస్తుంటుంది. ఎవ‌రికి వారికి అనుభ‌వ‌మ‌య్యే విష‌యాల్నే చూద్దాం. ఉద్యోగం చేసే వారైనా.. వ్యాపారం చేసే వారైనా..వారి వారి స్థాయిల్లో వారు కోరుకునే మార్పు వెనువెంట‌నే రాదు. ఆ మార్పు కోసం చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది.

ఎవ‌రికి వారు.. త‌మ ఆఫీసులు.. వ్యాపారాలు.. ఇళ్లల్లోనే ఇలాంటి ప‌రిస్థితి ఉంటుంద‌ని అనుకుంటారు. ఎక్క‌డో కొన్ని మిన‌హాయింపులు త‌ప్పిస్తే.. మొత్తంగా ఇలానే ఉంటుంది. ఇంత‌కీ ఈ ఉదాహ‌ర‌ణ అంతా ఎందుకు? కేటీఆర్‌.. ఆంధ్రోళ్లు అంటూ హెడ్డింగ్ పెట్టేసి.. ఇప్పుడు సంబంధం లేని విష‌యాలు చెబుతున్నార‌ని అనుకోవ‌ద్దు. ఎందుకంటే.. ఇప్పుడు చెప్పే అంశం అర్థం కావాలంటే ఈ విష‌యాల్ని చెప్పాలి మ‌రి.

ఇక‌.. విష‌యంలోకి వెళితే.. ప్ర‌పంచ మ‌హాస‌భ‌లు మా జోరుగా సాగుతున్న విష‌యం తెలిసిందే. దాదాపు రూ.60 కోట్ల భారీ ఖ‌ర్చుతో నిర్వ‌హిస్తున్న ఈ స‌భ‌ల్లో ఆంధ్రోళ్ల‌ను అవ‌మానించేలా ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్య‌వ‌హ‌రించార‌ని.. తెలుగు పేరిట నిర్వ‌హిస్తున్న ఉత్సావాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి పాత్ర లేకుండా చేయ‌ట‌మే కాదు.. వారిని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశార‌న్న విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తోంది.

ప‌క్క‌నున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రిని సైతం పిల‌వ‌ని స‌భ‌లు.. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు ఎలా అవుతాయ‌న్న ప్ర‌శ్న తెర మీద‌కు వ‌చ్చింది. ఈ విమ‌ర్శ తీవ్ర‌త రోజురోజుకీ పెరుగుతోంది. ఇదే రీతిలో సాగితే.. ముగింపు త‌ర్వాత ఆంధ్రోళ్ల‌ను అవ‌మానించేలా సాగిన ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌న్న ముద్ర ప‌డ‌టం ఖాయం. ఆ మ‌చ్చ ప‌డ‌కుండా.. ఆ అప‌కీర్తి త‌న ద‌రి చేర‌కుండా ఉండేలా చేయాల‌న్న ఆదేశాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. దీని ఫ‌లిత‌మే రాత్రికి రాత్రి సీన్ మొత్తం మారిపోయేలా చేసింది.

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల్లో సీమాంద్రుల‌కు ద‌క్కిన గుర్తింపు శూన్యం. ఆ విష‌యంలో మ‌రో మాట‌కు తావు లేదు. అయితే.. ఆ విష‌యానికి పెద్ద ప్రాధాన్య‌త ఉండ‌ద‌ని భావించినా.. కేసీఆర్ అండ్ కో అంచ‌నాల‌కు భిన్నంగా ఈ వివాదం రాజుకుంది. దీన్ని చ‌ల్లార్చేందుకు కేసీఆర్ పావులు క‌ద‌ప‌ట‌మే కాదు.. దాని బాధ్య‌త‌ల్ని మంత్రి కేటీఆర్‌ కు ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు. దీంతో.. యుద్ధ ప్రాతిప‌దిక‌న పావులు క‌దిలాయి. సోమ‌వారం రాత్రి ఎల్ బీ స్టేడియంలో నిర్వ‌హించే కార్య‌క్ర‌మానికి షెడ్యూల్ ప్ర‌కారం మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌.. ప్ర‌ముఖ సినీ న‌టులు నాగార్జున‌.. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు లాంటి కొన్ని పేర్లు మాత్ర‌మే ఉన్నాయి.

ఇందుకు భిన్నంగా భారీ ఎత్తున సినీ ప్ర‌ముఖులు ఎల్ బీ స్టేడియంకు పోటెత్త‌టం విశేషం. దీనికి కార‌ణం లేక‌పోలేదు. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల వేదిక మీద సీమాంధ్ర‌ప్రాంతానికి చెందిన‌వారికి ఎలాంటి ప్రాధాన్య‌త ద‌క్క‌లేద‌న్న విష‌యాన్ని చిన్న‌ది చేసేందుకు.. అంద‌రిని స‌మానంగా చూశామ‌న్న భావ‌న‌ను క‌లిగించే క్ర‌మంలో సినీ ప్ర‌ముఖుల్ని పిల‌వ‌ట‌మే కాదు.. వారికి పేరు పేరున స‌త్కారం చేయ‌టం ద్వారా.. త‌మ మీద మ‌చ్చ‌ను పోయేలా చేసుకోగ‌లిగారు. నిన్న‌టి కార్య‌క్ర‌మంతో ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు ఒక్క ప్రాంతానికే ప‌రిమితం కాలేద‌ని.. సీమాంద్రుల‌కు పెద్ద‌పీట వేశామ‌న్న భావ‌న క‌లిగేలా చేశారు. టాలీవుడ్ రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల నేప‌థ్యం సీమాంధ్ర అన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. దీనికి తోడు.. పార్టీల‌కు అతీతంగా సినీ ప్ర‌ముఖుల్ని స‌మీక‌రించ‌టంలో మంత్రి కేటీఆర్ వ్య‌క్తిగ‌తంగా చేసిన కృషితో రాత్రికి రాత్రి సీన్ మొత్తం మారిపోయింద‌ని చెబుతున్నారు. కృష్ణ‌.. చిరంజీవి.. బాల‌కృష్ణ‌.. మోహ‌న్ బాబు.. నాగార్జున‌.. సుమ‌న్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. భారీ ఎత్తున సినీ ప్ర‌ముఖులు ఎల్ బీ స్టేడియంకు పోటెత్త‌టం చూస్తే.. కేసీఆర్ చ‌తుర‌త‌.. కేటీఆర్ ప‌నిత‌నం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించ‌క మాన‌దు.