Begin typing your search above and press return to search.

ఆ ఫొటో పాకిస్థాన్‌ ది అంటున్న కేటీఆర్‌..!

By:  Tupaki Desk   |   3 Aug 2016 8:48 AM GMT
ఆ ఫొటో పాకిస్థాన్‌ ది అంటున్న కేటీఆర్‌..!
X
సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మాచారం ఏదైనా స‌రే, దాన్ని 100 శాతం స‌రైందిగా న‌మ్మ‌లేం క‌దా! ఎందుకంటే, ఎవ‌రైనా ఏదైనా పోస్ట్ చేసుకోవ‌చ్చు. అది నిజ‌మా అబ‌ద్ధ‌మా అని ప్ర‌శ్నించే అవ‌కాశం ఉండ‌దు. అయితే, కొన్ని పోస్టులు ఇట్టే వైర‌ల్ అయిపోతూ ఉంటాయి. హైద‌రాబాద్ మెట్రో రైలుకు సంబంధించిన ఒక ఫొటో ఇలానే వైర‌ల్ అయిపోయింది. మెట్రో రైలు ప్రాజెక్టును ఎంతో ప్ర‌తిష్ఠాత్మంగా చేప‌డుతోంది తెలంగాణ సర్కారు. మెట్రో రైలు నిర్మాణం పూర్త‌యితే న‌గ‌రానికి ట్రాఫిక్ కష్టాలు తీరుతాయ‌ని సామాన్య జ‌నం కూడా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సంద‌ర్భంలో మెట్రో రైళ్ల కోసం నిర్మిస్తున్న పిల్ల‌ర్ల నాణ్య‌తపైనే అనుమానాలు వ్య‌క్తం అయ్యేలా ఓ ఫొటో ఫేస్‌ బుక్‌ లోకి వ‌చ్చింది. గ‌చ్చిబౌలీ స‌మీపంలో మెట్రో రైలు కోసం నిర్మిస్తున్న ఓ పిల్ల‌ర్ కూలిపోవ‌డానికి సిద్ధంగా ఉందంటూ ఓ ఫొటో వ‌చ్చింది. పిల్ల‌ర్‌ కు బీట‌లు వారిన‌ట్టు ఈ చిత్రంలో క‌నిపిస్తోంది. దీంతో సోష‌ల్ మీడియాలో ఆందోళ‌న మొద‌లైంది. ఈ పోస్టు చూసిన‌వారంతా ఒక కామెంట్ పెట్టి - షేర్ కొట్టేస్తున్నారు. దాంతో ఇది సిటీ నెటిజ‌న్ల‌లోకి బాగా వెళ్లిపోయింది. ఈ విష‌యం తెలంగాణ మంత్రి కేటీర్ దృష్టికి వ‌చ్చింది. ఆయ‌న వెంట‌నే స్పందించారు.

కూలిపోవ‌డానికి సిద్ధంగా ఉన్న మెట్రో రైలు పిల్ల‌ర్ అంటూ చ‌క్క‌ర్లు కొడుతున్న ఫొటో పోస్టుపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పోస్టులో క‌నిపిస్తున్న ఫొటో హైద‌రాబాద్ మెట్రో రైలుకు సంబంధించి కాదంటూ స్ప‌ష్టం చేశారు. పీవీ ఎక్స్‌ ప్రెస్ హైవేకి చెందింది కూడా కాద‌ని చెప్పారు. ఇది పాకిస్థాన్‌ లోని రావ‌ల్ఫండీకి చెందిన ఫొటో అని కేటీఆర్ వివ‌రించారు. ఇలాంటి పుకార్ల‌ను ద‌య‌చేసి న‌మ్మొద్దంటూ విజ్ఞ‌ప్తి చేశారు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న పుకార్ల ప‌ట్ల అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరారు. నిజానికి, మెట్రో రైలు పిల్ల‌ర్ చిత్రం అన‌గానే హైద‌రాబాదీయులు ఆందోళ‌న చెందిన మాట వాస్త‌వ‌మే. ఇప్ప‌టికే మెట్రో నిర్మాణంతో ర‌హ‌దారుల‌న్నీ అస్త‌వ్య‌స్థ‌మై ట్రాఫిక్ జామ్‌ లు అనేవి న‌గ‌ర జీవికి నిత్య‌కృత్య‌మైపోయాయి. కొన్నాళ్లు ఈ క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని భ‌రించేస్తున్నారు! ఇలాంటి సంద‌ర్భంలో మెట్రో పిల్ల‌రుకు బీటలు అన‌గానే ఆందోళ‌న చెందారు. ఈ పుకారు మరింత విస్త‌రించే లోపే మంత్రి కేటీఆర్ స్పందించ‌డం మంచిదైంద‌ని చెప్పుకోవాలి.