Begin typing your search above and press return to search.

ఉప ఎన్నిక‌ల‌కు భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌

By:  Tupaki Desk   |   7 Dec 2015 3:13 AM GMT
ఉప ఎన్నిక‌ల‌కు భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌
X
తెలంగాణ పున‌ర్‌ నిర్మాణంలో భాగ‌స్వామ్యులు కావాలంటూ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ ను విజ‌య‌వంతంగా ముందుకు తీసుకువెళుతున్న టీఆర్ ఎస్ పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేల‌ను కారు ఎక్కించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. క్యాంపు ఆఫీసు - బ‌హిరంగ స‌భ‌లు అంటూ తేడా లేకుండా గులాబీ కండువా క‌ప్పుతున్నారు. ఇలా టీడీపీ - కాంగ్రెస్‌ - వైసీపీ - బీఎస్పీకి చెందిన ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్య‌లోనే గులాబీ గూటికి చేరిపోయారు.

ఈ చేరిక‌ల‌పై ప్ర‌తిప‌క్షాలు చేసే డిమాండ్ల‌లో ముఖ్య‌మైన‌ది...పార్టీలు ఫిరాయించాల‌నుకునేవారు ముందుగా ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని. ఎమ్మెల్యేలు చేయ‌క‌పోతే వారితో ప‌ద‌వికి రాజీనామా చేయించాల‌ని టీఆర్ ఎస్‌ ను డిమాండ్ చేస్తున్నారు. అయితే టీఆర్ ఎస్ అందుకు స‌సేమిరా అన‌టంతో అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కోరుతూ స్పీక‌ర్‌ కు ఫిర్యాదు చేశారు. హైకోర్టును ఆశ్ర‌యించారు. టీడీపీ దీనిపై పోరాటం చేస్తూ ఏకంగా రాష్ర్ట‌ప‌తికి - కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌ కు ఫిర్యాదుచేసింది. మ‌రోవైపు ఉప ఎన్నిక‌ల‌కు భ‌య‌ప‌డ‌టం వ‌ల్లే అన‌ర్హ‌త వేటు కోర‌డం లేద‌ని టీఆర్ ఎస్‌ పై ఆయా పార్టీల నాయ‌కులు సెటైర్లు వేశారు. ఈ విష‌యంలో టీఆర్ ఎస్ అధినేత - సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ తాజాగా స్ప‌ష్ట‌త ఇచ్చారు.

టీఆర్ ఎస్ ఉప ఎన్నిక‌లకు భ‌య‌ప‌డే పార్టీ కానేకాద‌ని...పార్టీ ఆవిర్భావం నుంచి తాము ఎన్నో ఉప ఎన్నిక‌లు ఎదుర్కున్నామ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం చ‌ర్చ న‌డుస్తున్న‌ ఎమ్మెల్యేల అన‌ర్హ‌త‌ విష‌యంలో నిర్ణ‌యం స్పీక‌ర్ ప‌రిధిలో ఉన్న‌ద‌ని...రాజ్యంగ అధినేత‌గా ఆయ‌న నిర్ణ‌యంపై వ్యాఖ్యానించే అధికారం ఎవ‌రికీ ఉండ‌ద‌ని చెప్పారు. గ‌తంలో తాము సైతం ప‌లువురు ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయించేందుకు సుదీర్ఘ కాలం ఎదురుచూశామ‌ని గుర్తుచేశారు. స్పీక‌ర్ వ‌ద్ద పెండింగ్ అంటూ తామేమీ ఎన్నిక‌ల‌ను త‌ప్పించుకోవ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలాఉండ‌గా సినిమా ప‌రిశ్ర‌మ‌లోని ప‌లువురితో స‌న్నిహితంగా ఉండ‌టంపై కేటీఆర్ స‌మాధాన‌మిచ్చారు. సినిమా ప‌రిశ్ర‌మపై ప‌రోక్షంగా 30,000 మంది ఆధార‌ప‌డి ఉన్నార‌ని....అనుకోని ప‌రిస్థితుల్లో ఈ ప‌రిశ్ర‌మ త‌ర‌లివెళితే ఇబ్బందులు త‌లెత్తుతాయ‌నే తాను ఆ వ‌ర్గాల‌తో స‌న్నిహితంగా ఉంటున్న‌ట్లు తెలిపారు.