Begin typing your search above and press return to search.

ఆ నేత పేరు చెప్పి మరీ సీనియర్ నేతలకు క్లాసు పీకిన కేటీఆర్?

By:  Tupaki Desk   |   6 Oct 2021 11:40 AM IST
ఆ నేత పేరు చెప్పి మరీ సీనియర్ నేతలకు క్లాసు పీకిన కేటీఆర్?
X
గడిచిన ఏడున్నరేళ్ల కాలంలో.. ఆ మాటకు వస్తే టీఆర్ఎస్ పెట్టిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ ఎదురుకాని చిత్రమైన పరిస్థితి తెలంగాణ అధికారపక్షానికి ఎదురవుతోంది. ఉద్యమ వేళలోనూ.. ఆ తర్వాతి కాలంలో ఒక స్థాయి దాటిన మాటల్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కానీ ఆయన కుటుంబ సభ్యుల్నికానీ అనే సాహసం ఎవరూ చేయలేదు. అలాంటిది తిరుగులేని సీఎంగా మన్ననలు అందుకుంటూ.. ఎన్నికల్లో ఘన విజయాలు సాధిస్తున్న ఆయన్ను.. ఆయన ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా విమర్శలు.. ఆరోపణలు తీవ్రస్థాయిలో ఎదురవుతున్నాయి.

మరి ముఖ్యంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బండి సంజయ్.. టీపీసీసీ చీఫ్ గా ఎంపికైన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడో పరీక్షగా మాట్లాడారు. వీరికి షర్మిల తోడయ్యారు. ఒకలా మూడు వైపుల నుంచి ముప్పేట దాడి మాదిరి.. ప్రభుత్వంపై ప్రతి విషయంలోనూ ఏదో ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి.. తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏదో ఒక విషయాన్ని టేకప్ చేసి దానిపై నిరసనలు.. ఆందోళనల్ని తెలంగాణ విపక్షాలు ఎప్పుడో ఒకసారి తప్పించి తరచూ చేసేవి కావు.
అందుకు భిన్నంగా బండి.. రేవంత్..షర్మిల పుణ్యమా అని ఏదో ఒక ఆందోళనను నిర్వహిస్తున్న వైనం టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. విపక్షాలు ఎవరికి వారుగా ఉన్నప్పటికీ.. వారందరి టార్గెట్ తామే అయిన విషయాన్ని టీఆర్ఎస్ గుర్తిస్తూ.. ఎదురుదాడిని మొదలు పెట్టింది. అయితే.. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ నేతల్లో కనిపించిన కసి.. ఇప్పుడు కనిపించట్లేదన్న ఆరోపణ ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ను.. ఆయన తర్వాత మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి ఎంత మాట అన్నా.. పట్టించుకోనట్లుగా కొందరు మంత్రులు మౌనంగా ఉండటంపై తాజాగా మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారం గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

విపక్షాల విమర్శల్ని తిప్పి కొట్టటం.. సమర్థవంతంగా ప్రభుత్వ విధానాల్ని తెలియజేసేలా చేయాల్సింది పోయి.. మౌనంగా ఉంటున్న నేతలకు చురకలు అంటించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెబుతున్నారు. జీవన్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చి.. పార్టీ అధినేతను ఉద్దేశించి ఎవరు ఎలాంటి విమర్శ చేసినా.. ఆయన కౌంటర్ ఇస్తారని.. ఆయన మాదిరి మిగిలిన వారు ఎందుకు మాట్లాడరని? మౌనంగా ఎందుకు ఉంటారు? అని కేటీఆర్ విరుచుకుపడినట్లు చెబుతున్నారు. తీరు మార్చుకోవాలన్న ఆయన.. విపక్షాల విమర్శలను సమర్థంగా తిప్పి కొట్టాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టంచేసినట్లు చెబుతున్నారు. చూస్తుంటే.. ఇన్నాళ్లకు గులాబీ బాస్ కు చురుకు పుట్టేలా విపక్షాలు వ్యవహరిస్తున్నాయన్న విషయం తాజా ఉదంతం స్పష్టం చేస్తుందన్న మాట వినిపిస్తోంది.