Begin typing your search above and press return to search.

శభాష్ కేటీయార్ : నోరిప్పలేని ఏపీకి బలమైన గొంతుకగా నిలిచావ్....

By:  Tupaki Desk   |   7 Jun 2022 1:30 AM GMT
శభాష్ కేటీయార్ : నోరిప్పలేని ఏపీకి  బలమైన గొంతుకగా నిలిచావ్....
X
ఏపీ ఎలా ఉంది అంటే సమస్త సమస్యలతో కునారిల్లుతోంది. విలన్ ఎవరూ అంటే ఎదురుగానే ఉన్నారు. కానీ అన్యాయం చేసిన వారితోనే చెట్టాపట్టాల్ కట్టడానికి పోటీ పడుతున్న దైన్యమైన రాజకీయం అక్కడ సాగుతోంది. ఏపీలో అన్నీ చేశామని బీజేపీ జబ్బలు చరచుకుని వీధులలో తిరుగుతోంది. మీటింగ్స్ పెడుతోంది. అయినా ఏమీ అనలేని నిస్సహాయ స్థితి అక్కడ ఉంది.

కారణం  రాజకీయంగా బీజేపీకి కలసి వచ్చేలా ఏవో తెలియని బంధాలు తెర వెనకా ఎదుటా  అలా అల్లుకుపోయాయి. అధికార వైసీపీ మూడేళ్ళుగా రాజ్యం చేస్తున్నా కేంద్రం ఫలానా పని మాకు చేసి పెట్టలేదు అని క్యాటగారికల్ గా ఒక్క మాట అనలేదు ఇంతవరకూ. అదే విధంగా కేంద్రం ఏమీ చేయకపోయినా మద్దతు పార్లమెంట్ లో కొనసాగుతోంది.

ఇక విపక్షం తీరు కూడా డిటోగా ఉంది. చావు బాజా మోగిస్తూ పెట్రోల్ డీజిల్  గ్యాస్ సహా అన్ని రకాలైన ధరలను పెంచేసి నిత్యావస ధరలతో సహా అన్నీ దారుణంగా పెరిగేలా చేసినా కూడా మహానాడు వేదికగా ఒక్క మాట కూడా కేంద్రాన్ని అనలేని పరిస్థితిలో టీడీపీ అధినాయకత్వం ఉంది. సమస్త పాపాలకూ జగన్ కారణమని దూకుడు చేస్తున్న టీడీపీ అందులో ఎంతో కొంత కేంద్ర వాటా కూడా ఉందని గట్టిగా కాదు సన్నగా కూడా చెప్పలేకపోతోంది.

కేంద్రం నుంచి విభజన హామీల రూపంలో 70 వేల కోట్లు రావాల్సి ఉంది ఇప్పటికి అయిదేళ్ల క్రితం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అంటూ మేధావులతో నిజాలను నిర్ధారింపచేసిన జనసేన ఇపుడు బీజేపీతోనే కలసి  ఉంది. ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ బీజేపీకి ఏమీ అనలేకపోతున్నా కూడా  పొరుగు రాష్ట్రం గొంతు మాత్రం గట్టిగా వినిపించి ఏపీ జనాల ఆవేదనకు అద్దం పట్టిన  అరుదైన సందర్భం ఇది.

నా సోదర రాష్ట్రం ఏపీకి కేంద్రం ఏమీ చేయలేదు, గుండు సున్నా కొట్టింది అని హైదరాబాద్ లో తాజాగా  జరిగిన తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2021-2022 వార్షిక నివేదిక ఆవిష్కరణ  సభలో కేటీయార్ అన్న మాటలు విన్న ఆంధ్రుడు ఎవరైనా శభాష్ అనక మానరు. ఏపీకి అసలు ఏమిచ్చింది కేంద్రం అని ఆయన సూటిగానే ప్రశ్నించారు.  ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 2014లో ఉన్నవి ఏమీ ఈ రోజుకీ బీజేపీ  చేయలేదని అన్నారు.

తెలంగాణకే కాదు, నా సోదరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కి కూడా ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు హామీ ఇచ్చారు. ఎనిమిదేళ్లుగా ఒక్క ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం లేదు అని ఆయన కుండబద్ధలు కొట్టారు. అసలు మీరు మాకు ఏమిచ్చారు అంటూ రెండు తెలుగు రాష్ట్రాల తరఫున నిండైన ప్రతినిధిగా కేటీయార్ కేంద్రాన్ని ప్రశ్నించిన తీరు చూసిన వారికి ఇదే కదా అడగాల్సింది అనిపించకమానదు. నిజమే కేంద్రం తెలంగాణాకు ఆంధ్రాకు అన్యాయం చేసింది.

అయితే తెలంగాణా మంత్రిగా పదే పదే అక్కడ జరుగుతున్న అన్యాయం మీద కేసీయార్, కేటీయార్ కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ ఆయన తన సొంత రాష్ట్రం గురించే కాకుండా నిన్నటిదాకా కలసి ఉన్న ఆంధ్రా గురించి కూడా మాట్లాడడం మాత్రం విశేషంగా చెప్పుకోవాలి.

అలాగే నోట్ల రద్దుతో ఆర్ధిక వ్యవస్థను దిగజార్చారని కూడా ఆయన చాలా కటువుగానే కేంద్రాన్ని కార్నర్ చేసి పారేశారు. మొత్తానికి చూస్తే ఒక్క కేటీయార్ చాలడా ఆంధ్రుల తరఫున ఒక్క మాటైన తూటాలా కేంద్రం మీద ప్రయోగించడానికి అని ఆయన  తీరు మీద  అద్భుతహ అనే అంటున్నారు. ఇప్పటికైనా కేటీయార్ స్పూర్తితో అయినా  అంధ్ర రాజకీయమా కేంద్రాన్ని నిలదీయుమా. ఉలుకూ పలుకూ లేకుండా మౌనం వహించకుమా అనే అయిదు కోట్ల ఆంధ్రులు కోరుతున్నారు.