Begin typing your search above and press return to search.

బండికి.. రేవంత్ కు పదవులు కేసీఆర్ పుణ్యమేనా?

By:  Tupaki Desk   |   19 Feb 2022 6:41 AM GMT
బండికి.. రేవంత్ కు పదవులు కేసీఆర్ పుణ్యమేనా?
X
తండ్రికి తగ్గ తనయుడు అన్న మాట.. మిగిలిన రంగాల్లో ఎలా ఉన్నా.. రాజకీయ రంగంలో మాత్రం అలాంటి పరిస్థితి చాలా చాలా తక్కువనే చెప్పాలి. అందునా.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారి సంతానం.. సదరు ముఖ్యమంత్రి స్థాయికి సమానంగా ఎదిగిన వారు దేశంలోనే అతి తక్కువ మంది కనిపిస్తారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషపడాల్సిందేనని చెప్పాలి.

కేసీఆర్ లో కనిపించేంతగా తియ్యటి మాటలు చెప్పలేకున్నా.. మరీ తీసి పారేసే మాదిరి మాత్రం కేటీఆర్ మాటలు ఉండవనే చెప్పాలి. అందరిని కలుపుకుపోవటం.. అవసరమైన వారిని దగ్గరకు తీసుకోవటం.. తేడా వచ్చే వారితో దూరంగా ఉండటం లాంటి విషయాల్లోనూ కేసీఆర్ నేర్పును మంత్రి కేటీఆర్ అందిపుచ్చుకున్నారనే చెప్పాలి.

అలాంటి కేటీఆర్ లో ఈ మధ్యన ఫస్ట్రేషన్ ఎక్కువ అవుతోందా? మర్యాదగా మాట్లాడే ఆయన.. ఇటీవల తమపై ఎక్కుపెడుతున్న విమర్శనాస్త్రాల ధాటికి బ్యాలెన్సు మిస్ అవుతున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తేలా ఆయన మాటలు ఉంటున్నాయి. తరచూ మర్యాద గురించి మాట్లాడే మంత్రి కేటీఆర్.. తాజాగా ఆ విషయాన్ని ఆయన మర్చిపోవటమే కాదు.. తన రాజకీయ ప్రత్యర్థులపై ఘాటుగా రియాక్టు అయ్యారు.

‘కేసీఆర్ అనే మూడు అక్షరాల పేరున్న వ్యక్తి లేకపోతే తెలంగాణ వచ్చి ఉండేదా? కేసీఆర్ లేకపోతే టీబీజేపీ.. టీపీసీసీ పదవులు వచ్చేవా? అవి కేసీఆర్ పెట్టిన భిక్ష. రేవంత్ రెడ్డి హౌలా.. బండి సంజయ్ దివాలా. వారి మాటలకు బాధ పడనవసరం లేదు. కేసీార్ ఎవరైనా ఏమైనా అంటే మౌనం వహించకుండా సివంగిలా గర్జించాలి’ అంటూ మండిపడ్డారు కేటీఆర్. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని విన్నంతనే.. వేలెత్తి చూపించేలా ఉండటమే పెద్ద లోపంగా చెప్పాలి.

ఇవాల్టి రోజున రేవంత్ రెడ్డి.. బండి సంజయ్ లాంటి వారికి పదవులు వచ్చాయంటూ అదంతా కేసీఆర్ పుణ్యమా అని చెబుతున్న కేటీఆర్.. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం ఎవరి పుణ్యం? అన్న ప్రశ్న ఉదయిస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. తన తండ్రి కేసీఆర్ గొప్పతనాన్ని కీర్తించటం తప్పు కాదు. కానీ.. ఆ పేరుతో ప్రదర్శించే దూకుడు వారికే చేటు తెచ్చేలా మారుతోందన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ కు మించి.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకే ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి.

ఒకవేళ ఆమె కాకుండా మరెవరు ఉన్నా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయ్యేది కాదు. ఇదే విషయం కేసీఆర్.. కేటీఆర్ లు తమ వ్యక్తిగత సంభాషణల్లోనూ మీడియాతో పంచుకోవటం తెలిసిందే. నిజానికి.. ఉన్నది ఉన్నట్లుగా చూసినప్పుడు సోనియాగాంధీ లేకుంటే తెలంగాణ కోసం ఎవరెంత అరిచి గీపెట్టినా వచ్చేదా? అన్నది ప్రశ్న. ఈ మాటను తెలంగాణ ప్రజల్ని అవమానించేలా ఉందంటూ భావోద్వేగాల్ని బయటకు తీసే ప్రయత్నం చేయటం ఇప్పటివరకు బాగానే ఉన్నా.. అసలు నిజం ఏమిటన్నది అందరికి తెలిసిందనే అన్న మాట వినిపిస్తోంది.

ఈ తరహా వ్యాఖ్యలు తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని తక్కువ చేసేలా.. గులాబీ పార్టీ అహంకారానికి నిదర్శనంగా నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి మాటలతో సోనియాను గుర్తు చేసినట్లు అవుతుందని చెప్పక తప్పదు. కేసీఆర్ వల్లే అందరికి పదవులు వచ్చాయన్న మాటల్ని విన్నప్పుడు.. మరి కేసీఆర్ మాటో? అన్న ప్రస్తావన తప్పక వస్తుందని.. ఈ తరహా వ్యాఖ్యల్ని కేటీఆర్ కట్టిపెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. మరి.. కేటీఆర్ ఈ సూచనపై స్థిమితంగా ఆలోచిస్తారా?