Begin typing your search above and press return to search.

రాముడిని బీజేపీ మోసం చేసింది - తారక రాముడు

By:  Tupaki Desk   |   8 April 2019 4:52 PM GMT
రాముడిని బీజేపీ మోసం చేసింది - తారక రాముడు
X
కల్వకుంట్ల తారక రాముడు పత్రికలపై ప్రశంసలు కురిపించారు. తరచుగా మీడియాపై అసంతృప్తి వ్యక్తంచేసే కేటీఆర్ ఈసారి మెచ్చుకున్నారు. ‘‘ప్రజాస్వామ్యంలో పత్రికలు తమ కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు నాయకులను నిలదీస్తున్నాయని‘‘ టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. మల్కాజిగిరి లో టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ - బీజేపీ - టీఆర్ ఎస్ మధ్యే పోటీ ఉందని... చెప్పిన కేటీఆర్ - కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తే - బీజేపీ దేవుడిని మోసం చేసిందన్నారు. రెండు పార్టీలు దేశాన్ని వెనక్కు నడిపించాయని... కేసీఆర్ ఆలోచనలను దేశం ఫాలో అవుతోందని అన్నారు.

కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్ ... ఆ పార్టీ వాళ్లు తప్పులను సరిదిద్దుకుంటామని చెబుతున్నారని, అంటే వారు తప్పులు చేసిన విషయం స్పష్టంగా ఒప్పుకుంటున్నారని అన్నారు. అయినా 60 ఏళ్లుగా అధికారంలో ఉండి తప్పులు ఎందుకు సరిదిద్దుకోలేదని ప్రశ్నించారు. వాళ్లు ఆరు దశాబ్దాలుగా అవినీతిని పెంచి పోషించారని అన్నారు. ఇన్ని తప్పులు చేసి ఇంకో సారి కాంగ్రెస్ మళ్లీ అవకాశం ఇవ్వాలని అడుగుతోందని - మళ్లీ ఇస్తే మళ్లీ తప్పులు చేయడానికా అని ప్రశ్నించారు.

బీజేపీ గురించి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ వాళ్లు ప్రజలను మోసం చేశారు... వాళ్లను మించిన పార్టీ బీజేపీ. వీళ్లు ఏకంగా దేవుడినే మోసం చేశారు. బీజేపీ అంటే రాముడిని మోసం చేసిన పార్టీ అని అన్నారు. వీళ్లను తెలంగాణ ఆదరించిన తెలంగాణకు వీళ్లు మోసం చేశారని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. అసలు బీజేపీ నేతలు హైదరాబాద్ కు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. చట్టపరంగా రావాల్సిన డబ్బు మినహా... ప్రత్యేకంగా ప్రేమతో ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.

పైగా దేవుడ్ని మోసం చేసిన ఈ పార్టీ కేసీఆర్ యాగాలు చేస్తారని, దేవుడిని నమ్ముతారని విమర్శిస్తున్నారంటే... ఎంత దిగజారి పోయారో అర్థమవుతుందన్నారు. ఇప్పటివరకు ప్రతి ఎన్నికల్లో రామ మందిర నిర్మాణం బీజేపీ మ్యానిఫెస్టోలో ఉంది. ఇంతకాలం కట్టని వాళ్లు ఇపుడు కడతారా? అసలు ఈ రెండు పార్టీలను ఈసారి తరిమేయాలి, ఫెడరల్ ఫ్రంట్ రావాలి అని కేటీఆర్ అన్నారు. కమిట్ మెంట్ ఉన్న లీడర్ ఇన్నాళ్లు దొరక్క ఈ పార్టీలు ప్రజలతో ఆడుకున్నాయని ఇక ముందు ఇలాంటి మోసాలకు అవకాశం లేదన్నారు. మంచి నాయకుడు ఉంటే దేశం ముందుకు వెళ్తుందన్నారు.