Begin typing your search above and press return to search.

కేంద్రానికి వ్యతిరేకంగా ఏపిని దువ్వుతున్నారా ?

By:  Tupaki Desk   |   23 Nov 2020 5:45 PM GMT
కేంద్రానికి వ్యతిరేకంగా ఏపిని దువ్వుతున్నారా ?
X
వ్యవహారం చూస్తుంటే అలాంటి అనుమానమే వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసి) ఎన్నికల్లో గెలుపు లక్ష్యంతో పావులు కదుపుతున్న అధికార టీఆర్ఎస్ పార్టీ తాజాగా కేంద్రానికి వ్యతిరేకంగా ఏపిని దువ్వుతున్నట్లే అనిపిస్తోంది. ఏపి అభివృద్ధికి కేంద్రం పిడికెడు మట్టి, చెంబుడు నీళ్ళు తప్ప ఇంకేమీ ఇవ్వలేదంటూ ఎద్దేవా చేయటం కలకలం రేపుతోంది. నిజానికి అమరావతి శంకుస్ధాపనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడి మాట్లాడుతూ చాలా మాటలే చెప్పారు కానీ అంతిమంగా పిడికెడు మట్టి, చెంబుడు నీళ్ళు మాత్రమే ఇచ్చారన్నది వాస్తవం.

అయితే అప్పట్లో ఇదే మహాప్రసాదంగా భావించిన చంద్రబాబునాయుడు తర్వాత బీజేపీతో చెడిన తర్వాత ఇదే విషయమై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇపుడదే అంశాన్ని తెలంగాణా బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో కేటీయార్ ప్రస్తావించారు. ఏపి రాజధానికి కేంద్రం ఏమీ ఇవ్వలేదన్నారు. అమరావతి శంకుస్ధాపన సమయంలో మోడి ఏమి ప్రకటించారంటూ నిలదీశారు. పనిలో పనిగా రూ. 100 కోట్లను అమరావతి నిర్మాణానికి ఇవ్వాలని కేసీయార్ అనుకున్నారట. అయితే మోడినే ఏమీ ప్రకటించకపోతే తాను ప్రకటించటం బాగోదని కేసీయార్ కూడా ఏమీ మాట్లాడలేదన్నట్లుగా కేటీయార్ చెప్పారు.

నరేంద్రమోడిపై ఈమధ్యనే కేసీయార్ యుద్ధం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. డిసెంబర్ మొదటివారంలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ హైదరాబాద్ కు పిలిచి ఓ సమావేశం ఏర్పాటు చేస్తానని కేసీయార్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఇపుడందరి దృష్టి కేసీయార్ ప్రకటనపైనే ఉంది. ఇటువంటి సమయంలో కేంద్రానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డిని కూడా కేటీయార్ రెచ్చగొడుతున్నట్లే ఉంది. మరి జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అంతిమంగా ఎన్ని డైలాగులు కొట్టినా ఏమి ఉపయోగం, ప్రజలకు ఏమి చేశామన్నదే ముఖ్యం అంటూ కేటీయార్ ముగించారు.