Begin typing your search above and press return to search.

వారిద్ద‌రిది పాము.. ముంగిస స్నేహమట !

By:  Tupaki Desk   |   26 Feb 2019 11:42 AM IST
వారిద్ద‌రిది పాము.. ముంగిస స్నేహమట !
X
పిట్ట‌క‌థ‌లు చెబుతూ ప్ర‌త్య‌ర్థుల్ని పూచిక పుల్ల‌ల మాదిరి తీసి పారేసే గుణం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. తండ్రి ల‌క్ష‌ణాల్ని వంట బ‌ట్టించుకోవ‌టంలో ఇప్ప‌టికే అంద‌రి మ‌న్న‌న‌లు పొందిన కేటీఆర్‌.. తండ్రి బాట‌లోనే ప‌య‌నిస్తున్నారు. విమ‌ర్శ‌లు చేయ‌టంలో ఘాటు త‌గ్గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టం.. ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌రి దృష్టి త‌న మీదా.. త‌న మాట‌ల మీదా ప‌డేలా చూసుకునే కేటీఆర్‌.. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై మ‌రోసారి దున‌మాడారు.

తాము మాత్ర‌మే క‌నిపించాలి. మ‌రెవ‌రి ఉనికి ఉండ‌కూడ‌ద‌న్న వైఖ‌రి రాజ‌కీయాల్లో క‌నిపిస్తూ ఉంటుంది. కాకుంటే.. కేటీఆర్ లాంటి వారిలో మోతాదు మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. ప్ర‌త్య‌ర్థుల ఉనికి సైతం ప్ర‌శ్నార్థ‌కంగా ఉండాల‌న్న‌ట్లుగా ఆయ‌న మాట‌లు ఉంటాయి. తాము చేస్తే లేని త‌ప్పు.. ప్ర‌త్య‌ర్థులు చేస్తే మాత్రం అస్స‌లు ఊరుకోని నైజం కేటీఆర్ లో క‌నిపిస్తుంది.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ.. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ తుది ఫ‌లితం తాము కోరుకున్న‌ట్లుగా ఉండాల‌న్న క‌సి.. క‌మిట్ మెంట్ తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ లో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇందుకు త‌గ్గ‌ట్లే ఆయ‌న ఎవ‌రి మీద‌నైనా స‌రే.. విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధించేందుకు రెఢీ అవుతున్నారు. తెలంగాణ‌లో ఉన్న 17 ఎంపీ సీట్ల‌లో త‌మ మిత్రుడైన అస‌దుద్దీన్ ఓవైసీకి ఒక్క ఎంపీ సీటు మిన‌హాయించి.. మిగిలిన 16 సీట్లు త‌మ ఖాతాలో ప‌డాల‌న్న త‌ప‌న‌తో పాటు.. ఏపీలో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌న్న వాంఛ కేటీఆర్ మాట‌ల్లో క‌నిపిస్తూ ఉంది.

ఇక‌.. కేంద్రంలో కాంగ్రెస్‌.. బీజేపీల‌కు మెజార్టీ రాకుండా ప్రాంతీయ పార్టీల‌కు అత్య‌ధిక సీట్లు వ‌స్తే.. తాము ముందుండి చ‌క్రం తిప్పాల‌న్న ఆలోచ‌న‌లోనూ ఆయ‌న ఉన్నారు. ఇందుకు త‌గ్గ‌ట్లే ఆయ‌న తాజా మాట‌లు ఉంటున్నాయి. ఈ మ‌ధ్య‌నే జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేత‌ల‌కు తెలంగాణ ప్ర‌జ‌లు బాగానే బుద్ధి చెప్పార‌న్న ఆయ‌న‌.. రెండు ఎంపీ సీట్ల‌తో తెలంగాణ‌ను సాధించిన నేత‌గా కేసీఆర్ కు ప‌ద‌హారు ఎంపీల‌ను ఇస్తే కేంద్రాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తామ‌ని చెప్పారు.

ఈసారి కాంగ్రెస్‌ కు వంద ఎంపీ సీట్లు కూడా రావ‌న్న కేటీఆర్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌తి ఒక్క ఎంపీ సీటు కీల‌కంగా అభివ‌ర్ణించారు. ఇక‌.. ప‌నిలో ప‌నిగా త‌న‌దైన శైలిలో పాము ముంగిస స్నేహంపై ఒక పిట్ట‌క‌థ‌ను చెప్పారు. పాము.. ముంగిస‌లు చంద్ర‌బాబు రాహుల్ గా అభివ‌ర్ణించిన ఆయ‌న ఢిల్లీలో ఢీ కొనే ఇద్ద‌రు తాజాగా ఒక్క‌ట‌య్యార‌న్నారు. ప్ర‌జా కూట‌మి పేరుతో తెలంగాణ‌లో హ‌డావుడి చేశారంటూ ఎద్దేవా చేశారు.

నిజ‌మే కేటీఆర్ సారూ.. మీరు చెప్పింది అక్ష‌రాల నిజం. కానీ.. తెలంగాణ సాధ‌న కోసం ఒక‌సారి కాంగ్రెస్ తో మ‌రోసారి టీడీపీతో మ‌రోసారి బీజేపీ (ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేళ‌లో)తో జ‌త క‌ట్టి.. అవ‌స‌రం తీర్చుకోవ‌టం.. అంతిమ ల‌క్ష్యం కోసం ఎవ‌రితోనైనా జ‌త క‌ట్ట‌టం త‌ప్పు కాద‌ని సిద్ధాంతీక‌రించిన మీరు.. ఈ రోజున పాము ముంగిస స్నేహం గురించి చెప్ప‌టం సూప‌ర్.