Begin typing your search above and press return to search.

మీడియా వాళ్లకూ హామీలే.. అమలు ఉండదా

By:  Tupaki Desk   |   30 Nov 2015 4:15 AM GMT
మీడియా వాళ్లకూ హామీలే.. అమలు ఉండదా
X
జర్నలిస్టుల సంఘం నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. మీడియాకు చిన్నసైజు క్లాస్ పీకినంత పని చేశారు. ‘‘కొన్ని’’ మీడియా సంస్థల పేరుతో.. అందరూ మీడియా ప్రతినిధులపైనా ఆయన వ్యాఖ్యలు చేసేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్ని ఏకరువు పెట్టారు. తెలంగాణలోని జర్నలిస్టులకు తమ సర్కారు ఎన్నో హామీల్ని ఇచ్చిందంటూ వాటిని ప్రస్తావించటానికి మంత్రి కేటీఆర్ వెనుకాడలేదు.

జర్నలిస్టుల సంక్షేమానికి రూ.10కోట్ల కేటాయింపు.. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు.. జర్నలిస్ట్ భవన్.. డబుల్ బెడ్రూం ఇళ్లు లాంటి ఎన్నో హామీలు తమ ప్రభుత్వం ఇచ్చిందని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. మంత్రి కేటీఆర్ ప్రస్తావించినట్లుగా.. ఇన్ని హామీలు కేసీఆర్ సర్కారు ఇచ్చినప్పటికీ.. వాటిల్లో అమలు మాటేమిటి? అన్న ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర సర్కారు అధికారం చేతికి వచ్చి 19నెలలు పూర్తి అవుతున్నా.. ఇప్పటికి హామీల గురించి మాట్లాడటమే కానీ.. వాటి అమలు కాకపోవటం ఏమిటన్నది పెద్ద ప్రశ్న.

ఒక సంక్షేమ కార్యక్రమం రాష్ట్రంలోని ప్రజలందరికి అమలు కావటం కష్టమైన పనే. కానీ.. మీడియా అనే ఒక చిన్న వర్గానికి అమలు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాల్లో ఒక్కటంటే.. ఒక్క అంశం కూడా అమలు కాకపోవటాన్ని ఏమనాలి? ఎలా చూడాలి. జర్నలిస్టులకుడబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు తేలికైన వ్యవహారం కాదు. కానీ.. జర్నలిస్టులకు జారీ చేయాల్సిన హెల్త్ కార్డుల కోసం 19 నెలలు సమయం అవసరమా? అన్న ప్రశ్న వేసుకుంటే.. సమాధానం ఇట్టే దొరికిపోతుంది. మిగిలిన వర్గాల వద్ద మాట్లాడినట్లుగా జర్నలిస్టుల దగ్గర మంత్రి కేటీఆర్ మాట్లాడినట్లుగా కనిపిస్తుందే.