Begin typing your search above and press return to search.

మోడీని చూస్తే అంద‌రికీ భ‌యం...అదో ప‌గ‌టిక‌ల

By:  Tupaki Desk   |   21 Nov 2018 4:52 AM GMT
మోడీని చూస్తే అంద‌రికీ భ‌యం...అదో ప‌గ‌టిక‌ల
X
ఓ వైపు త‌న నియోజ‌క‌వ‌ర్గం సిరిసిల్ల లో ప‌ర్య‌టిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే...మ‌రోవైపు స్టార్ క్యాంపెయిన‌ర్‌ గా గ్రేట‌ర్‌ లో గులాబీ పార్టీ గెలుపును త‌న భుజాన వేసుకున్న టీఆర్ ఎస్ నేత‌ - రాష్ట్ర మంత్రి కే తారకరామారావు ఇదే త‌రుణంలో మీడియాతో కూడా త‌న స‌ఖ్య‌త‌ను కొన‌సాగిస్తున్నారు. ప్రాంతీయ మీడియా నుంచి మొదలుకొని జాతీయ మీడియా వ‌ర‌కు...రాష్ట్ర రాజ‌కీయాల నుంచి మొద‌లుకొని జాతీయ రాజ‌కీయాల వ‌ర‌కు ఆయ‌న స్పందిస్తున్నారు. తాజాగా ఆయ‌న ప్రధాని నరేంద్రమోడీ విధానాల‌పై స్పందించారు. బీజేపీ నేత‌ల‌పై సెటైర్లు వేశారు. ప్ర‌ధాని మోడీ ప్రజాదరణను చూసి మిగిలిన పార్టీలన్నీ భయపడుతున్నట్టు బీజేపీ నాయకులు పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. నిజానికి మోడీ ప్రాభవం రోజురోజుకూ తగ్గుతున్నదని మంత్రి కే తారకరామారావు అన్నారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్రజాదరణకు భయపడే తెలంగాణలో టీఆర్ ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో పాటు ఆ పార్టీ నాయకులు తరచూ వ్యాఖ్యానించడం చిత్రంగా ఉంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరిగితే బీజేపీకి లాభం చేకూరుతుందనే టీఆర్ ఎస్ ముందుస్తుకు పోయిందని బీజేపీ నేత‌లు ఆరోపించడం వారి అభద్రతాభావానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయ‌కులు ఇతర పార్టీలపై ఆరోపణలు మానుకుని మోడీకి ప్రజాదరణ ఎందుకు తగ్గుతున్నదో పరిశీలించుకోవాలని హితవు పలికారు. బీజేపీ-టీఆర్ ఎస్ రహస్యంగా పొత్తుపెట్టుకున్నట్టు కాంగ్రెస్ చేస్తున్న వాదనను మంత్రి కేటీఆర్ కొట్టిపారేశారు. తెలంగాణలో బీజేపీకి ఉనికిలేదని - దీనిపై కాంగ్రెస్ అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ - కాంగ్రెస్‌ లకు టీఆర్ ఎస్ వ్యతిరేకమని - రాష్ట్రాన్ని పాలించుకునే సమర్థత టీఆర్ ఎస్‌ కు ఉన్నదని స్పష్టంచేశారు.

ఈ సంద‌ర్భంగా జాతీయ రాజ‌కీయాల‌పైనా మంత్రి కేటీఆర్ స్పందించారు. జాతీయపార్టీలు బలహీనపడుతున్నాయని, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్నీ బలం పుంజుకుంటున్నాయని తెలిపారు. జాతీయ పార్టీలే ప్రాంతీయ పార్టీల మద్దతు కోరుకునే రోజులు వస్తాయన్నారు. వారసత్వ రాజకీయాలు - కుటుంబపాలన గురించి మాట్లాడే అర్హత రాహుల్‌ కు లేదని, ఇలాంటి రాజకీయాల ద్వారా అందరికంటే ఎక్కువగా లాభపడుతున్నది ఆయనేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని నడిపే అర్హత రాహుల్‌ గాంధీకి ఏముందో అర్థం కావడంలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కుటుంబ అర్హ‌త కంటే రాహుల్‌ కు ఉన్న గొప్ప అర్హ‌త ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.