Begin typing your search above and press return to search.

బంగారు మాట: లాక్ డౌన్ కాదు.. వ్యాక్సిన్ వచ్చే వరకూ బతకాల్సిందే

By:  Tupaki Desk   |   3 Aug 2020 4:00 PM GMT
బంగారు మాట: లాక్ డౌన్ కాదు.. వ్యాక్సిన్ వచ్చే వరకూ బతకాల్సిందే
X
అప్పుడెప్పుడో కరోనాతో సహజీవనం తప్పదని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబితే పుసుక్కున నవ్వినోళ్లు కోట్లాది మంది ఉన్నారు. కొన్నిమాటలు విన్నంతనే ఎక్కడ లేని ఉత్సాహం తన్నుకొస్తుంటుంది. ఏదో తెలీని ఆనందం కూడా. కరోనా విషయంలో పూర్తి క్లారిటీతో సీఎం జగన్ మాట్లాడితే.. ఆయన మాటల్లోని వాస్తవాన్ని గుర్తించే కన్నా.. ఎటకారం చేసుకోవటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వైనాన్ని మర్చిపోకూడదు.

ఎప్పుడైతే.. జగన్ మాట అక్షరసత్యమన్న విషయం అర్థమైందో.. అప్పటివరకే ఎక్కెసాలు చేసినోళ్లంతా చప్పుడు చేయకుండా ఉండిపోయారు. వాస్తవాన్ని గుర్తించటం మొదలు పెట్టారు. అలా కరోనా మీద కొన్ని నెలల క్రితమే జగన్ క్లారిటీ ఇస్తే.. ఏమైందో ఏమో కానీ.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు మాత్రం తాజాగా జనాలకు ఏదో కొత్త విషయం చెప్పాలనిపించింది.

తాజాగా ఆయనో అద్భుతమైన సందేశాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పేశారు. వ్యాక్సిన్ వచ్చే వరకూ కరోనాతో బతకాల్సిందేనని..లాక్ డౌన్ పరిష్కారం కాదన్నారు. ఎవరికి వారు జాగ్రత్తలో ముందుకు సాగాలన్న ఆయన.. లాక్ డౌన్ సమస్యకు సొల్యుషన్ కాదన్నప్పుడు.. అంతకాలం ఎందుకు కంటిన్యూ చేసినట్లు? అన్నది ప్రశ్న. కేంద్రం కంటే రెండు రోజుల ముందే తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ఎందుకు? అన్న ప్రశ్నలు మనసులోకి రాక మానదు.

లాక్ డౌన్ తో ఏ దేశంలోనూ కరోనా సమస్యకు పరిష్కారం కాదన్న ఆయన మాటలు విన్నంతనే వూహాన్ సంగతేంటి కేటీఆర్ మహాశయా? అన్న సందేహం మనసులోకి రాక మానదు. తన పుట్టిన రోజు సందర్భంగా అంబులెన్సుల్ని పార్టీ తరఫున ఇచ్చేందుకు వీలుగా విరాళాల్ని సేకరించిన ఆయన.. అందులో భాగంగా ఐదు అంబులెన్స్ ల్ని అందజేశారు.

కరోనాను ఎదుర్కోవాలంటే నివారణ ఒక్కటే మార్గమని.. అవగాహన పెంచుకొని మహమ్మారిని ఎదుర్కోవాలన్నారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలన్న ఆయన.. శానిటైజర్ వాడాలన్నారు. కరోనా బాధితులందరికి హోం ఐసోలేషన్ కిట్లు అందిస్తామని చెప్పిన ఆయన.. బాధితుల సంఖ్య పెరిగితే డబుల్ బెడ్రూం ఇళ్లను కూడా ఐసోలేషన్ కేంద్రాలుగా వాడుకోవాలని చెప్పారు.

ఆసుపత్రుల్లో అదనపు సిబ్బంది తీసుకుంటామని.. రాబోయే ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు అన్ని రకాల హంగులతో సన్నద్ధంగా ఉంటామని చెప్పారు. అన్ని సలహాలు.. సూచనలు బాగున్నాయి కానీ.. తన తండ్రి కమ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను మాస్కు పెట్టుకొమ్మని మంత్రి కేటీఆర్ చెప్పగలరంటారా?