Begin typing your search above and press return to search.

కేటీఆర్ నోట ‘వంద’ మాట వచ్చిందంటే..?

By:  Tupaki Desk   |   12 Jan 2016 5:30 AM GMT
కేటీఆర్ నోట ‘వంద’ మాట వచ్చిందంటే..?
X
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ నోటి వెంట ఆసక్తికర వ్యాఖ్య ఒకటి వచ్చింది. నిజానికి ఆయన చేసిన వ్యాఖ్య వింటే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఎంత ధీమాగా ఉందన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. గ్రేటర్ కు జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లలో 100 డివిజన్లలో తమ గెలుపు ఖాయమన్న ధీమాను కేటీఆర్ వ్యక్తం చేశారు. ఏయే పార్టీకి ఎన్నెన్ని సీట్లు వస్తాయన్న విషయాన్ని కాస్త అటూఇటూగా చెప్పి.. నెంబరు గేమ్ లో ఏ పార్టీ ఏ వరుసలో ఉంటుందన్న విషయాన్ని చెప్పారు. అంతేకాదు.. తాను చెప్పినట్లుగా గ్రేటర్ మీద గులాబీ జెండా ఎగరకుంటే తన పదవికి రాజీనామా చేస్తానంటూ సరికొత్త సవాలును తెర మీదకు తీసుకొచ్చారు.

కేటీఆర్ నోటి వెంట గెలపు మాట ఓకే. కానీ.. వంద స్థానాలు గెలుచుకుంటామన్న మాట దగ్గరే అసలు చర్చంతా. ఇంత భారీగా టీఆర్ ఎస్ సీట్లు గెలుచుకుంటుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మాంచి ఊపు మీద ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ టచ్ చేయని వందమార్క్ ను తాము అలవోకగా దాటేస్తామన్న మాట చూస్తే.. కేటీఆర్ అండ్ కో కాన్ఫిడెన్స్ ఏమిటో ఇట్టే అర్థమవుతుంది.

నిజానికి కేటీఆర్ చెప్పినట్లుగా వందసీట్లలో కారు విజయం దిశగా దూసుకుపోతుందా? అంటే సందేహమే. గ్రేటర్ లో మజ్లిస్ కున్న పట్టును తక్కువ అంచనా వేయలేం. ఆ స్థానాలు పోగా.. సీమాంద్రులు దాదాపు సగానికి పైగా స్థానాల్లో విజయాన్ని డిసైడ్ చేసే శక్తిగా ఉండటం చిన్నదేం కాదు. కాకుంటే.. పలుచోట్ల సీమాంధ్రులు అధికారపక్షానికి అండగా ఉంటారన్న అంచనా ఎంతవరకు నిజం అవుతుందన్నది ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి.

ఇక.. కేటీఆర్ మాటల్నే చూస్తే.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ తొలిస్థానంలో నిలిస్తే.. మజ్లిస్ సెకండ్.. బీజేపీ మూడో స్థానంలో.. టీడీపీ నాలుగో స్థానంలో నిలుస్తుందని తేల్చారు. ఇక.. కాంగ్రెస్ పార్టీ సాధించే స్థానాల విషయంలో సింగిల్ డిజిట్ దాటదని తేల్చేశారు. మొత్త 150 స్థానాలకు వంద స్థానాల్లో విజయం సాధించటం సాధ్యం కాదని కాకుంటే గ్రేటర్ పై గులాబీ జెండా ఎగరటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మైండ్ గేమ్ రాజకీయాల విషయాల్లో రాటు దేలిన టీఆర్ ఎస్.. రాజకీయ ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకే కేటీఆర్ వంద మాట మాట్లాడుతున్నట్లుగా చెబుతున్నారు.