Begin typing your search above and press return to search.
తిరుగులేని రాజకీయ శక్తి టీఆర్ ఎస్.. కేటీఆర్
By: Tupaki Desk | 21 Oct 2017 5:15 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు రాష్ట్ర మున్సిపల్ - పట్టణాభివృద్ధి - ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తమ పార్టీ గురించి మరోమారు ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ...గల్లీ నుంచి ఢిల్లీ రాజకీయాల వరకు విశ్లేషించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ పాలక మండలి. శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ ప్రమాణ స్వీకారం - వ్యాయామ ఉపాధ్యాయుడి పదవీ విరమణ కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తి టీఆర్ ఎస్సేనని తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో అనేక మంది రోడ్డు మీదికి వచ్చిన వారు, తెరవెనుక ఉండి ఉద్యమాలు చేసిన వారూ సీఎం కేసీఆర్ మదిలో పదిలంగా ఉన్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. `2019లో ముఖ్యమంత్రి మళ్లీ కేసీఆరే.. ఇది కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి - ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా తెలుసు. పార్టీలోని ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది. అందరినీ గౌరవించే సంస్కృతి మన ప్రభుత్వానిదే.. ఆందోళన వద్దు త్వరలో నామినెట్ పోస్టులను భర్తీ చేస్తాం` అని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా పని చేస్తూనే 17 ఏళ్ల క్రితం పని చేసిన కార్యకర్తలను గ్రామాల వారీగా - జిల్లాల వారీగా పేరుపేరున ఆయన గుర్తు పెట్టుకున్నారని - అందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ఆకునూరి శంకరయ్య - శిశుసంక్షేమ శాఖ ఆర్గనైజర్ గా గుగులోతు రేణల పేర్లును ఖరారు చేయడమే నిదర్శమన్నారు. ఎవరి పేర్లనూ తాను సూచించలేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ మన పార్టీ అధికారంలోకి వస్తుందని - పదవులు రాలేదని నిరాశ పడవద్దని కార్యకర్తలకు - నాయకులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమంటూ లేదని - బలీయమైన రాజకీయ శక్తిగా టీఆర్ ఎస్ పార్టీ ఎదగడానికి ప్రజల ఆశీస్సులు - అండదండలున్నాయనీ మంత్రి కేటీఆర్ అన్నారు. పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని - వారి సహకారంతోనే టీఆర్ ఎస్ విజయం సాధించిందని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తాయంటూ ప్రతిపక్షాలే చెప్పడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో రూ.3 కోట్లతో ఆధునిక గ్రంథాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. విద్యార్థులకు కంప్యూటర్ తో డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. మండలాలు, గ్రామాలకు గ్రంథాలయ వ్యవస్థను విస్తరింపజేయాలని పాలకమండలికి పిలుపు నిచ్చారు. జిల్లా కేంద్రంలో 20 ఎకరాలలో క్రీడా మైదానం నిర్మించడానికి నిధులు కేటాయిస్తానని ప్రకటించారు. అలాగే పైకా శిక్షణ కేంద్రానికి ఎంఎన్‌సీ రూ.50 లక్షలు మంజూరు చేయాలని మంత్రి కోరారు. పిల్లలను ర్యాంకుల పేరిట మానసికంగా కుంగదీయడం సరికాదని చదువుతోపాటు ఆటల్లో రాణించేలా ప్రోత్సహించాలని ఈసందర్భంగా తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.