Begin typing your search above and press return to search.

నాన్నేమో దేవుడికి దండం పెడ‌తారు..మీరేమో దండ‌యాత్ర అంటున్నారే!

By:  Tupaki Desk   |   25 Jun 2019 6:50 AM GMT
నాన్నేమో దేవుడికి దండం పెడ‌తారు..మీరేమో దండ‌యాత్ర అంటున్నారే!
X
కాలం క‌లిసి వ‌చ్చిన‌ప్పుడు ఏమ‌న్నా న‌డిచిపోతుంది. ఏం చేసినా ఎదురుండ‌దు. అదంతా ఎప్ప‌టివ‌ర‌కూ కాలం.. క‌ర్మం బాగున్నంత వ‌ర‌కే. ఆ త‌ర్వాత‌.. చేసిన త‌ప్పుల‌కు వ‌డ్డీతో స‌హా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆ చిన్న విష‌యాన్ని టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మిస్ అవుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

తాజాగా ఆయ‌న మాట‌ల్లో ఆత్మ‌విశ్వాసం కంటే అతిశ‌యం హ‌ద్దులు దాటేస్తుంది. తాజాగా ఒకేసారి టోకుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో (రెండు.. మూడు జిల్లాల్ని మిన‌హ‌యిస్తే) టీఆర్ ఎస్ కార్యాల‌యాల శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న టీఆర్ ఎస్ కార్యాల‌య నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణ ప్ర‌యోజ‌నాలు కాపాడుకోవ‌టానికి కేంద్రం..ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌తోనే కాదు.. అవ‌స‌ర‌మైతే దేవుడితోనైనా త‌ల‌ప‌డే నాయ‌కుడు కేసీఆర్ అని అభివ‌ర్ణించారు.

భూప్ర‌పంచంలో పోలిక ఎవ‌రితోనైనా పెట్టుకోవ‌చ్చు.కానీ.. ప్ర‌కృతితోనూ.. క‌నిపించ‌ని దేవుడు (విశ్వాసం ఉన్నోళ్ల‌కు మాత్ర‌మే) ను ఉద్దేశించి అంతేసి మాట‌లు అవ‌స‌ర‌మా? అన్న‌ది ప్ర‌శ్న‌.

నాన్నేమో అదే ప‌నిగా దేవుడు.. పూజ‌లు అంటూ విప‌రీతంగా ఆరాధిస్తుంటే.. మీరేమో అదే దేవుడితో త‌ల‌ప‌డేందుకు సైతం సిద్ధ‌మ‌ని మాట్లాడ‌టంలోఅర్థం ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఈ మ‌ధ్య‌న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో హిందుగాళ్లు.. బొందుగాళ్లు అన్న మాట‌కు హ‌ర్ట్ అయిన వారిచ్చిన తీర్పుతోనే కిందామీదా ప‌డిన‌ప్పుడు.. అంత పెద్ద దేవుడి ఇగో హ‌ర్ట్ అయ్యేలా మాట్లాడ‌టం అవ‌స‌ర‌మా? కాలం క‌లిసి వ‌చ్చిన‌ప్పుడు ఈ త‌ర‌హా మాట‌లు రావంటారు. మ‌రిప్పుడు వ‌స్తున్నాయంటే ఏమిటి? అన్న ప్ర‌శ్న వేసి.. తూలిన మాట‌కు చెంప‌లేసుకుంటే మంచిదేమో? కాస్త ఆలోచించండి కేటీఆర్. త‌న మానాన తానున్న దేవుడ్ని అన‌వ‌స‌రంగా సీన్లోకి లాగితే ఏం బాగుంటుంది చెప్పండి?