Begin typing your search above and press return to search.

కేటీఆర్ నోట లంగ నేత‌ల మాటేంది?

By:  Tupaki Desk   |   30 Jun 2018 1:30 PM GMT
కేటీఆర్ నోట లంగ నేత‌ల మాటేంది?
X
రాజ‌కీయాల‌న్నా విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు త‌ప్ప‌నిస‌రి. అవి లేని రాజ‌కీయాల్ని ఊహించ‌లేం. కానీ.. హ‌ద్దులు దాటేసే మాట‌లు కూడా బాగోవు. అందునా.. రేపో.. మాపో.. అది కాదంటే కేసీఆర్ త‌ర్వాత అధికార పీఠం కేటీఆర్ దేన‌న్న వ్యాఖ్య‌లు జోరు అంత‌కంత‌కూ పెరుగుతున్న వేళ‌.. స్థాయికి త‌గ్గ‌ట్లు మాట్లాడాల్సిన అవ‌స‌రం చాలామంది.

ఏరు దాటాక తెప్ప త‌గ‌లేసే వైనం పాలిటిక్స్ లో మామూలే అయినా.. మోతాదు మించిన వైనం మంచిది కాదు. మాంచి ఫ్యూచ‌ర్ ఉన్న నేత‌గా.. అంద‌రిని క‌లుపుకు వెళ్లే నాయ‌కుడిగా.. దుందుడుకు వ్యాఖ్య‌లు పెద్ద‌గా చేయ‌ని రాజ‌కీయ వార‌సుడిగా పేరు తెచ్చుకున్న కేటీఆర్‌.. ఇటీవ‌ల కాలంలో మారిన ఆయ‌న మాట తీరు అంద‌రిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ముంద‌స్తు ఎన్నిక‌ల హ‌డావుడి ఇప్పుడు తెలంగాణ‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. గ‌డిచిన నాలుగేళ్ల‌కు భిన్నంగా ప్రాజెక్టులు పూర్తి చేయ‌టానికి తెలంగాణ ప్ర‌భుత్వం ప‌డుతున్న హ‌డావుడి అంతా ఇంతా కాదు. అంతేనా.. కేసీఆర్ స‌ర్కారు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు గొప్ప‌త‌నాన్ని ప్ర‌జ‌ల‌కు చేర‌వేయ‌టం కోసం చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్ని ఇన్ని కావు.

మీడియాకు ప్ర‌త్యేక బ‌స్సులు ఏర్పాటు చేయ‌ట‌మే కాదు.. నాన్ వెజ్ ఫుడ్ తో పాటు.. లిక్క‌ర్ విందుతో కాళేశ్వ‌రం పర్య‌ట‌న‌కు చేస్తున్న వైనం చూస్తే.. కార్పొరేట్ లాబీయింగ్‌ కు ఏ మాత్రం త‌గ్గ‌న‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు. త్వ‌ర‌లో ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌న్న ప్ర‌య‌త్నంలో ఉన్న కేసీఆర్ స‌ర్కారు.. త‌మ సర్కారు మైలేజీ పెంచే ఏ అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌టం లేద‌ని చెప్పాలి.

ఎన్నిక‌ల వేళ‌.. త‌మ‌కు ప్ర‌త్య‌ర్థిగా.. గ‌ట్టి పోటీ ఇచ్చే అవ‌కాశం ఉన్న కాంగ్రెస్ పార్టీకి షాకులిచ్చే ప‌నిని కేసీఆర్ అండ్ కో మొద‌లు పెట్టార‌ని చెప్పాలి. ఇందులో భాగంగానే ఆయ‌న కాంగ్రెస్ ను.. ఆ పార్టీ నేత‌ల్ని ఉద్దేశించి కేసీఆర్ అండ్ కో చేస్తున్న విమ‌ర్శ‌లు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నాయి.

తాజాగా మంత్రి కేటీఆర్ మాట‌ల్నే తీసుకుంటే.. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాతోపాటు.. ఆ పార్టీ నేత‌ల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు ఇప్ప‌డు ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. అమెరికాలో పెద్ద చ‌దువులు చ‌దువుకొని వ‌చ్చి.. తెలంగాణ‌ను ఏదేదో చేద్దామ‌న్న‌ట్లుగా చెప్పే కేటీఆర్‌.. లంగ నేత‌లంటూ ఆయ‌న నోటి నుంచి రావ‌టం చూస్తే.. రాజ‌కీయాల్ని ఆయ‌న ఏస్థాయికి తీసుకెళ్లాల‌నుకుంటున్నారు? అన్న భావ‌న క‌ల‌గ‌క మాన‌దు.

ట్రంప్ కుమార్తె ఇవాంక‌తో పాటు.. ప‌లువురు అంత‌ర్జాతీయ ప్ర‌ముఖుల స‌ర‌స‌న కూర్చొని హుందాగా మాట్లాడిన పెద్ద మ‌నిషి నోటి నుంచి ఇంత చౌక‌బారు వ్యాఖ్య‌లు రావ‌ట‌మా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. మైలేజీ కోసం ఏమైనా చేస్తామ‌న్నట్లుగా కేటీఆర్ వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని చెప్పాలి. లంగ నేత‌లు పుడ‌తార‌నే స్వాతంత్య్రం రాగానే కాంగ్రెస్ పార్టీని ర‌ద్దు చేయాల‌ని అనాడు మ‌హాత్మాగాంధీ అన్నారంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు అభ్యంత‌ర‌క‌రంగా మారాయి. చిన్న‌బుచ్చ‌టానికి.. ఎట‌కారం చేయ‌టానికి చాలానే మాట‌లు ఉన్నా.. అవేమీ గుర్తుకు రాకుండా ఈ త‌ర‌హా మాట‌లు కేటీఆర్ నోటి రావ‌టం చూసిన‌ప్పుడు కొత్త అనుమానాలు త‌లెత్త‌క మాన‌దు. గెలుపు ధీమాలో ఉన్న‌ప్పుడు ఒకలాంటి భ‌రోసా క‌నిపిస్తుంది. అలాకాకుండా.. తిరుగులేని బ‌లంతో ఉన్న వారు స‌డ‌న్ గా బ‌లం త‌గ్గిపోయింద‌న్న భావ‌న‌లోకి వెళ్లిన‌ప్పుడు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ‌తారు. ఇలాంటి వేళ‌.. త‌మ పాత బ‌లాన్ని తిరిగి తెచ్చుకోవ‌టానికి దేనికైనా రెఢీ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తారు. కేటీఆర్ తాజా మాట‌లు అలాంటి తీరునే గుర్తుకు తెస్తున్నాయ‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ఉన్న‌ప్పుడు ఎదుటోడి త‌ప్పుల్ని లాజిక‌ల్ గా చూపించి తిట్టాలే కానీ.. నోరు పారేసుకుంటే ఎలా కేటీఆర్?