Begin typing your search above and press return to search.

ప్రజలకు బాకీ లేం.. కేటీఆర్ సంచలన కామెంట్స్!

By:  Tupaki Desk   |   8 Aug 2019 7:10 AM GMT
ప్రజలకు బాకీ లేం.. కేటీఆర్ సంచలన కామెంట్స్!
X
తెలంగాణ రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లో అసహనం తన్నుకొచ్చింది.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందని లబ్ధిదారులు నిలదీస్తే వారికేం బాకీ లేము మేము అని ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

సిరిసిల్ల ఎమ్మెల్యే అయిన కేటీఆర్ తాజాగా సిరిసిల్ల జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీలు కేటీఆర్ కు మొర పెట్టుకున్నారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.5వేలు అందరికీ అందలేదని.. పింఛన్లు - సంక్షేమ పథకాల్లో జాప్యం పై ప్రజలు నిలదీస్తున్నారని.. గొడవకు దిగుతున్నారని జడ్పీటీసీ సమావేశంలో కేటీఆర్ కు విన్నవించారు.

దీనిపై కేటీఆర్ ఆవేశంగా స్పందించారు. ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నవి ప్రోత్సాహకాలేనని.. వారికేమీ మనం బాకీ లేమని కేటీఆర్ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఫలానా పథకం తమకు అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే ప్రజాప్రతినిధులు - అధికారులు వారికి నచ్చజెప్పాలని.. వారితో గొడవకు దిగవద్దని సూచించారు. ప్రజలు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు అందుకుంటున్న వేళ కాసింత సంయమనం పాటించాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, మరుగుదొడ్ల నిర్మాణం, కళ్యాణ లక్ష్మీ వంటి పథకాలు ప్రజలకు ప్రోత్సాహకంగా మాత్రమే ఇస్తున్నామని.. సంక్షేమ పథకాలు అందించినంత మాత్రాన ప్రజలకు బాకీ ఉన్నట్టు కాదని పేర్కొన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలని.. అందకపోతే దృష్టికి తీసుకురావాలన్నారు.

కాగా కేటీఆర్ చేస్తున్న సంచలన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. మొన్నటికి మొన్న వైద్యులను పనిచేస్తే చేయండి లేదంటే వెళ్లిపోండి.. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దంటూ స్పష్టం చేశారు. తాజాగా పథకాలు అందని ప్రజల నిలదీతను వారికి హక్కులేదంటూ స్పష్టం చేశారు. తాము ఇచ్చిందే తీసుకోవాలన్నట్టు మాట్లాడారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. హామీ ఇచ్చిన టీఆర్ ఎస్ ను ప్రజలు అమలు చేయాలని అడిగితే దబాయిస్తారా అని కేటీఆర్ ను కాంగ్రెస్ నేతల - ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారు.