Begin typing your search above and press return to search.

కేటీఆర్ స్పెషల్... అసెంబ్లీలోకి హీరోగిరీ వచ్చేసింది

By:  Tupaki Desk   |   10 Sep 2020 5:34 PM GMT
కేటీఆర్ స్పెషల్... అసెంబ్లీలోకి హీరోగిరీ వచ్చేసింది
X
మన దేశంలో మనలను పాలించే నేతలు కూర్చుని చట్టాలు చేసే మన చట్టసభల్లో మన ఓట్లతో గెలిచిన సభ్యులు ఏ రీతిన ప్రవర్తిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎగస్పార్టీ వాళ్లపైకి ఎగిరి గంతేసి మరీ కొట్టేంత పనిచేసే మహానుభావులే ఎక్కువ. ఈ క్రమంలోనే చట్టసభల్లోకి గుండాగిరీ చేయడానికి వచ్చావా? అంటూ మన రాజకీయ పార్టీలకు చెందిన నేతల నుంచి దూసుకువచ్చే మాటలు కూడా మనకు కొత్తేమీ కాదు. అయితే కాలం మారుతోంది కదా. గుండాగిరీ పోయి... దాని స్థానంలో హీరోగిరీ మన చట్టసభల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ తరహా కొత్త పదం వినిపించింది మన తెలంగాణ అసెంబ్లీలోనే. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నోట నుంచే.

నిజమా? అంటే... గురువారం నాటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను చూసిన వారు ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గుండాగిరీకి బదులుగా హీరోగిరీని అసెంబ్లీలోకి ఎంట్రీ ఇప్పించిన కేటీఆర్... దానిని ప్రత్యర్థి పార్టీ నేతలను కీర్తించడానికేమీ వాడలేదు. ప్రభుత్వంపై అసత్యాలను ప్రచారం చేయడం మానుకోవాలని, సత్యాలను మాత్రమే చెప్పాలని చురకలంటించే క్రమంలో కేటీఆర్ ఈ హీరోగిరీ మాటను ప్రయోగించారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కేటీఆర్ ఈ పద ప్రయోగాన్ని చేశారు. దీంతో కోమటిరెడ్డి కిక్కురుమనకుండా కూర్చోక తప్పలేదు.

అయినా కేటీఆర్ ఈ సందర్భంగా ఏమన్నారన్న విషయానికి వస్తే... రాష్ట్రంలో సిద్దిపేట, సిరిసిల్ల మునిసిపాలిటీలను మాత్రమే అభివృద్ది చేసుకుంటూ... ఇతర మునిసిపాలిటీలను కేసీఆర్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే మరుస్తోందని కోమటిరెడ్డి చేసిన ఆరోపణలను తిప్పికొట్టేందుకు రంగంలోకి దిగిన కేటీఆర్... కోమటిరెడ్డి వాదనలో నిజం లేదని ప్రతి దాడికి దిగారు. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలకు ప్రతి నెలా ఠంచనుగా రూ.148 కోట్లను విడుదల చేస్తున్నామని చెప్పారు. అయినా అభివృద్ధిలో పక్షపాతం చూపిస్తే... మునిపోల్స్ లో తమకు 130 మునిసిపాలిటీల్లో ఏకంగా 122 పురపాలికలను ప్రజలెందుకు కట్టబెడతారని కూడా కేటీఆర్ చెప్పారు. అసెంబ్లీ జీరో అవర్ లో కూడా మైక్ ఇచ్చినా హీరోగిరీ చేస్తామంటే మంచిది కాదని కోమటిరెడ్డికి కేటీఆర్ చురకలంటించారు.